ఆర్మీ కుటుంబాలను కబళించిన రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:05 AM
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భుజ్-ఖవడా జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఓ ట్రక్కు కారును ఢీకొట్టడంతో..
ట్రక్కు ఢీకొని 3నెలల పసికందు సహా ఏడుగురి మృతి
గుజరాత్‌లోని కచ్‌లో విషాద ఘటన
భుజ్, నవంబరు 22: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భుజ్-ఖవడా జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఓ ట్రక్కు కారును ఢీకొట్టడంతో, ఆర్మీ సిబ్బంది కుటుంబాలకు చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. భుజ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బంది కుటుంబ సభ్యులు శనివారం ‘రణ్ ఆఫ్ కచ్’ సందర్శనకు వెళ్లారు. తిరిగి కారులో భుజ్‌కు వస్తుండగా రాత్రి 10 గంటల సమయంలో ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన ట్రక్కు వీరి కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వీరిలో సౌరభ్ సింగ్ నేగి (30), ఆయన భార్య సవిత (30), వారి మూడు నెలల కుమార్తె శివిక; రాజేశ్ సింగ్ రావత్ (35), ఆయన ఏడేళ్ల కుమార్తె రక్షిత; రింకీ గోసైన్ (30), ఆమె నాలుగేళ్ల కుమార్తె వామిక ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.