రాజకీయ నేతలు అవినీతిపరులుగా మారారు
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:24 AM
రాజకీయాలు ప్రస్తుతం కలుషితమై పోయాయని, రాజకీయ నేతలు అవినీతి పరులుగా మారిపోయారని తెలంగాణ రాష్ట్రం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆదివారం సాయంత్రం శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
తెలంగాణలో బెల్టుషాపులు లేని ప్రాంతం మునుగోడే
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
చెన్నై, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలు ప్రస్తుతం కలుషితమై పోయాయని, రాజకీయ నేతలు అవినీతి పరులుగా మారిపోయారని తెలంగాణ రాష్ట్రం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆదివారం సాయంత్రం శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ రాజకీయ నేతలు అవినీతిపరులుగా మారిపోయారని, ఈ కారణంగా సీఎస్ స్థాయి నుంచి గ్రామ సెక్రటరీ స్థాయి వరకు అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు. సమాజంలో మార్పు కోసం పనిచేసే వారు.., ప్రజల కోసం నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేసే వారు రాజకీయాల్లోకి రావాలని, అప్పుడే మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, రాష్ట్రంలో బెల్టు షాపులు లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది తన సొంత నియోజకవర్గం (మునుగోడు) ఒక్కటేనని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా సమాజంలోని పేదలకు మంచి విద్య, వైద్యాన్ని అందించలేకపోవడం బాధగా ఉందన్నారు.