Enforcement Directorate: 60 డొల్ల కంపెనీలతో 6,200 కోట్ల మోసం
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:07 AM
బ్యాంకులను మోసం చేయడానికి 60 డొల్ల కంపెనీలను సృష్టించాడు కోల్‌కతా వ్యాపారి సంజయ్ సురేఖ. తన కార్ల డ్రైవర్లు, ఇంట్లో పనివాళ్లు, ఆఫీస్ బాయ్‌లు, జూనియర్ సిబ్బందిని డైరెక్టర్లుగా పెట్టి, కాగితాలపైనే కల్పిత టర్నోవర్ చూపి బ్యాంకులకు రూ.
బ్యాంకులకు కోల్‌కతా వ్యాపారి సంజయ్ సురేఖ కుచ్చుటోపీ
న్యూఢిల్లీ, జనవరి 1: బ్యాంకులను మోసం చేయడానికి 60 డొల్ల కంపెనీలను సృష్టించాడు కోల్‌కతా వ్యాపారి సంజయ్ సురేఖ. తన కార్ల డ్రైవర్లు, ఇంట్లో పనివాళ్లు, ఆఫీస్ బాయ్‌లు, జూనియర్ సిబ్బందిని డైరెక్టర్లుగా పెట్టి, కాగితాలపైనే కల్పిత టర్నోవర్ చూపి బ్యాంకులకు రూ. 6,200 కోట్లు కుచ్చుటోపీ పెట్టాడు. అతనికి అప్పులిచ్చిన బ్యాంకుల కన్సార్టియంలోని యూకో బ్యాంక్ అప్పటి సీఎండీ ఎస్‌కే గోయెల్ సహకారంతో అంత మొత్తం కాజేశాడు. సంజయ్ కంపెనీలన్నింటి మొత్తం విలువ కేవలం రూ.600 కోట్లు మాత్రమేనని, ఇప్పటివరకూ వాటి అమ్మకాల ద్వారా రూ. 434 కోట్ల మాత్రమే వచ్చిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు నివేదిక స్పష్టం చేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసులో విచారణ జరిపి ఈడీ 2024లో సంజయ్ సురేఖ, అతని సిబ్బందిని అరెస్టు చేసింది. గతఏడాది మే 16న ఢిల్లీలో ఎస్‌కే గోయెల్ అరెస్టుతో ఈ మోసం వ్యవహారం బట్టబయలైంది. ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన రూ. 106 కోట్లను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ దర్యాప్తు నివేదిక తాజా వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్లాంట్‌లు ఉన్న కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (సీ ఎస్‌పీఎల్)ను 2008లో సంజయ్ సురేఖ టేకోవర్ చేశారు. 2007 నుంచి 2010 వరకు యూకో బ్యాంక్ సీఎండీ పనిచేసిన గోయెల్ సహకారంతో సంజయ్ బ్యాంకుల నుంచి వడ్డీ, పెనాల్టీలు లేకుండా రూ. 6,200 కోట్ల రుణం పొందాడు. ఈ డబ్బులో కొంత మొత్తాన్ని క్విడ్ ప్రో కో కింద గోయెల్‌కు బదిలీ చేశాడు.