కిస్త్వాడ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు ఉగ్రవాదుల హతం
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:27 AM
జమ్మూ-కశ్మీర్‌లోని కిస్త్వాడ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఏడుగురు కరుడుగట్టిన ఉగ్రవాదులు హతమైనట్టు సోమవారం మిలటరీ వర్గాలు తెలిపాయి..
ఫలించిన 326 రోజుల నిఘా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: జమ్మూ-కశ్మీర్‌లోని కిస్త్వాడ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఏడుగురు కరుడుగట్టిన ఉగ్రవాదులు హతమైనట్టు సోమవారం మిలటరీ వర్గాలు తెలిపాయి. మంచుతో నిండిన చత్రూ కొండల్లోని అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో జైష్ ఎ మహమ్మద్ సీనియర్ కమాండర్ సైఫుల్లా సహా ముగ్గురు మరణించినట్టు ఆదివారం ప్రకటించగా ఆ సంఖ్య పెరిగినట్టు తాజాగా వెల్లడించాయి. ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్స్ష్, పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఇతర దళాలు సమన్వయంతో వ్యవహరించి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పేర్కొన్నాయి. ఆపరేషన్ ట్రాషీ-ఐ పేరుతో 326 రోజుల పాటు నిఘా పెట్టి ఎట్టకేలకు ఉగ్రవాదుల ఉనికిని గుర్తించాయి. కొండ కింద ఓ మట్టి ఇంట్లో దాక్కొన్న ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరపగా, భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగాయి. కాల్పుల కారణంగా ఆ ఇంట్లో మంటలు వ్యాపించడంతో ఉగ్రవాదుల శవాలు గుట్టుపట్టలేని రీతిలో కాలిపోయాయి. ఈ పోరులో మిలటరీ జాగిలం జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ‘టైసన్’ ప్రముఖ పాత్ర పోషించినట్టు ఆపరేషన్‌ను పర్యవేక్షించిన మేజర్ జనరల్ ఎ.పి.ఎ్‌స.బల్ చెప్పారు. తొలుత ఆ మట్టి ఇంట్లోకి దూరి ఉగ్రవాదులను గుర్తించినది టైసనేనని తెలిపారు. మొదటి బుల్లెట్ కూడా టైసన్‌కు తగిలిందని, తీవ్ర గాయం కావడంతో వాయు మార్గంలో ఉధంపూర్ ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు.