Share News

తేజస్వి అవమానించేలా మాట్లాడలేదు

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:29 AM

తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించేలా తమ పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

తేజస్వి అవమానించేలా మాట్లాడలేదు

  • అలా మాట్లాడి ఉంటే వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాం

  • కాంగ్రెస్‌ వల్లే 1,200 మంది ఆత్మబలిదానం: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించేలా తమ పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ అలా మాట్లాడి ఉంటే వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని లోక్‌సభలో చెప్పారు. ‘‘1969లో 369 మంది విద్యార్థులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాల్చి చంపింది. 2014 ఉద్యమంలో 1,200 మంది తెలంగాణ ఉద్యమకారులు బలిదానం చేసుకున్నారు. కాంగ్రెస్‌ తప్పుడు, మోసపూరిత విధానాల వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది. ఈ అంశాన్ని చెప్పడమే తేజస్వి ప్రధాన ఉద్దేశం’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. ఇలా ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు.

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: ఎంపీ తేజస్వీ సూర్య

తన వ్యాఖ్యలను దురుద్దేశంతో వక్రీకరించారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తీరుతో తెలంగాణ ఉద్యమంలో 1,200 మందికిపైగా చనిపోయారని, 300మందికిపైగా ఆత్మాహుతి చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తానని, తెలంగాణ ఉద్యమకారులకు నివాళులు అర్పిస్తానని తెలిపారు. కాగా కిషన్‌రెడ్డి, తేజస్వి మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య నిరసన తెలిపారు. కాగా, ఎన్నో బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రాన్ని కించపర్చేలా తేజస్వి చేసిన వ్యాఖ్యలు అవివేకమని, దురదృష్టకరమని కావ్య మండిపడ్డారు. డీలిమిటేషన్‌లో దక్షిణాదికి అన్యాయం చేసేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Updated Date - Apr 17 , 2026 | 03:29 AM