కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్లపై మాటల యుద్ధం
ABN , Publish Date - May 25 , 2026 | 04:05 AM
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అంశం రోజురోజుకు సంచలనమవుతోంది. సీజేపీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్లపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పరోక్షంగా చేసిన...
రిజిజు VS దీప్కే
పాకిస్థానీ ఫాలోవర్ల కోసం ఆరాటాన్ని చూస్తే జాలేస్తోంది: రిజిజు
దేశ యువతను పాకిస్థానీయులంటారా?: దీప్కే
న్యూఢిల్లీ, మే 24 : కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అంశం రోజురోజుకు సంచలనమవుతోంది. సీజేపీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్లపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పరోక్షంగా చేసిన ఓ పోస్టు ఆదివారం తీవ్ర దుమారం రేపింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, కేంద్ర మంత్రి రిజిజు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పాకిస్థాన్, జార్జ్ సోరోస్ ముఠా నుంచి సోషల్ మీడియా ఫాలోవర్ల కోసం ఆరాటపడుతున్న వారిని చూస్తుంటే జాలేస్తోందంటూ రిజిజు శనివారం ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. అటు సీజేపీని కానీ మరే పార్టీని, వ్యవస్థను కానీ రిజిజు తన పోస్టులో ప్రస్తావించలేదు. కానీ, సీజేపీ ఫాలోవర్ల సంఖ్యపై చర్చ జరుగుతున్న వేళ ఆయన చేసిన ఈ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, రిజిజు చేసిన పోస్టుకు అభిజిత్ దీప్కే ఎక్స్‌లో ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రి రిజిజు భారతీయ యువతపై పాకిస్థానీయులనే ముద్ర ఎందుకు వేస్తున్నారు? అంటూ దీప్కే ప్రశ్నించారు. అంతేకాక, తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అవ్వకముందు తమకున్న ఫాలోయర్ల భౌగోళిక సమాచారాన్ని తెలియజేసే డేటా ఎనలిటిక్స్ గ్రాఫ్‌ను చూపించే ఓ స్ర్కీన్ రికార్డింగ్ వీడియోను తన పోస్టుకు జత చేశారు. తమ ఖాతాను, పోస్టులను అనుసరించే వారిలో 94ు మంది భారతీయులేనని దీప్కే స్పష్టం చేశారు. దీప్కే పోస్టుకు స్పందనగా.. కిరెన్ రిజిజు ఆదివారం సాయంత్రం ఎక్స్‌లో మరో పోస్టు చేశారు. సీజేపీని ప్రస్తావించనప్పటికీ.. దేశ వ్యతిరేక ముఠాలకు చెందినవారు భారతదేశానికి ఎప్పటికీ హీరోలు కారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘భారత దేశ వ్యతిరేక ముఠాల్లోని హీరోలు ఎప్పటికీ భారతదేశానికి హీరోలు కాలేరు. ప్రజాస్వామ్యం, దేశ యువతపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలకడగా ఉంది’’ అని కిరెన్ రిజిజు పోస్టు చేశారు.