పిల్లల్ని కనడమే పరిష్కారమా?
ABN , Publish Date - May 19 , 2026 | 03:58 AM
ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలంటే మహిళలు మరింత మంది పిల్లల్ని కనడం మాత్రమే పరిష్కారమా?
చంద్రబాబుపై ఎక్స్ వేదికగా కిరణ్ బేడీ విమర్శలు
న్యూఢిల్లీ, మే 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలంటే మహిళలు మరింత మంది పిల్లల్ని కనడం మాత్రమే పరిష్కారమా? అని ఏపీ సీఎం చంద్రబాబును మాజీ ఐపీఎస్, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రశ్నించారు. పిల్లల్ని కనడానికి బదులుగా వేరుగా ఆలోచించలేమా? అని అన్నారు. తెలుగు భాషాభివృద్ధితో పాటు నైపుణ్య కేంద్రాలపై పెట్టుబడులు పెట్టాలని, దేశవ్యాప్తంగా ప్రతిభను ఆకర్షించి సామర్థ్యాలను పెంచి ఉత్పాదకతను బలోపేతం చేయాలని ఎక్స్ వేదికగా సూచించారు. మహిళలు రాష్ట్రం కోసం జనాభా పెంచే సాధనాలు కాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా జనాభా తగ్గుదలను ఎదుర్కొనేందుకు మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనాలని రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చని, అయితే మహిళలు తమ అత్యంత ఉత్పాదక జీవితకాలాన్ని ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనడం, పెంచడానికే వినియోగించాలనే భావన సరైనదేనా? అని ప్రశ్నించారు. జనాభా పెరుగుదలను ప్రోత్సహించడం కంటే, దేశంలోని కోట్లాదిమంది పిల్లలపై పెట్టుబడి పెట్టడం ముఖ్య కాదా? అని ఆమె అభిప్రాయపడ్డారు.