మోదీ ఒక ఉగ్రవాది!
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:46 AM
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఓ ఉగ్రవాది అంటూ సంభోదించారు. అలాంటి వ్యక్తితో...
ఆయనో అబద్ధాలకోరు.. మహిళా వ్యతిరేకి
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు
చెన్నై, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఓ ఉగ్రవాది అంటూ సంభోదించారు. అలాంటి వ్యక్తితో అన్నాడీఎంకే పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. మరో రెండు రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం చెన్నైలో కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి ఖర్గే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మోదీ సమానత్వాన్ని విశ్వసించరు. ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని విశ్వసించదు. అలాంటి వారితో చేతులు కలిపి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారు’ అంటూ అన్నాడీఎంకేపై ఖర్గే మండిపడ్డారు. తమిళనాడు ఎన్నికలను బీజేపీ నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంగా ఖర్గే అభివర్ణించారు.
ప్రధానమంత్రిని ఉగ్రవాది అనలేదు: ఖర్గే
ప్రధానిని ‘ఉగ్రవాది’ అనడంపై విలేకరులు ప్రశ్నించగా.. ఆయనను ఉగ్రవాది అని తాను అనలేదని, ప్రత్యర్థులను మోదీ భయపెడుతున్నారని అన్నానని ఖర్గే వివరణ ఇచ్చారు. ‘ఐటీ, ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన చేతుల్లో ఉన్నందున మోదీ ఎల్లప్పుడూ మమ్మల్ని భయపెడుతున్నారని అన్నాను. ఆయనో అబద్ధాలకోరు. మహిళా వ్యతిరేకి, పేదల వ్యతిరేకి. మోదీని నమ్మొద్దు. గత 12 ఏళ్లలో దేశ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదు’ అని ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్-డీఎంకే కూటమికే ఓటు వేయాలని తమిళనాడు ప్రజలను ఖర్గే కోరారు.
ఖర్గే క్షమాపణ చెప్పాలి: బీజేపీ
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారిపోవడం సిగ్గుచేటు. దేశప్రజలు ఎన్నుకున్న ప్రధానిని వారు ఉగ్రవాది అంటున్నారు. ప్రధానిని, దేశ ప్రజలను అవమానించినందుకు ఖర్గే క్షమాపణ చెప్పాలి. ఖర్గే, రాహుల్ గాంధీలను ప్రజలు క్షమించరు. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి ఓటు వేయడం ద్వారా వారికి తగిన గుణపాఠం చెబుతారు’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, సీఎం స్టాలిన్ కూడా క్షమాపణ చెప్పాలని గోయల్ డిమాండ్ చేశారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఖర్గే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడి అని అందులో పేర్కొంది.
బెంగాల్లో 2.5 లక్షల కేంద్ర బలగాలు!
పశ్చిమ బెంగాల్లో తొలి దశ పోలింగ్ ముంగిట మరో రాజకీయ వివాదం తలెత్తింది. హింసాకాండను నిరోధించడానికి ఎన్నికల కమిషన్(ఈసీ) అసాధారణ రీతిలో దాదాపు 2.4 లక్షల మంది కేంద్ర పారామిలిటరీ జవాన్లను (2,400 కంపెనీలు) రాష్ట్రంలో మోహరించింది. దీనిపై పాలక టీఎంసీ కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడింది. మిలిటరీ ద్వారా రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలని మోదీ సర్కారు భావిస్తోందని ఆరోపించింది. బెంగాల్లో 152 అసెంబ్లీ స్థానాల్లో గురువారం తొలి దశ పోలింగ్ జరగనుంది. కేంద్ర బలగాలన్నీ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా వాటి మోహరింపు ఉందని రాజకీయ వ్యాఖ్యాత చంద్రకుమార్ బోస్ అన్నారు. అయితే, ఎన్నికల వేళ గతంలో చాలా హింస జరిగిందని, ఈసారి అలా జరగవద్దనే భారీగా బలగాలను మోహరించామని ఈసీ తెలిపింది.
మూగవోయిన మైకులు
2 కీలక రాష్ట్రాల్లో రేపే పోలింగ్
తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు గురువారం ఒకే దఫాలో పోలింగ్ జరుగనుంది. 294 స్థానాల బెంగాల్ అసెంబ్లీలో తొలి విడతలో గురువారం 152 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. రాజకీయ పార్టీల విస్తృత ప్రచారం మంగళవారం సాయంత్రం పరిసమాప్తమైంది. తమిళనాడులో 5.73కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించనున్నారు. 234 సీట్లకు 4,023 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. డీఎంకే సారథ్యంలోని పాలక ఇండీ కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ, సినీ హీరో విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో డీఎంకే 164 చోట్ల పోటీచేస్తోంది. కాంగ్రెస్ 28 చోట్ల బరిలో ఉంది. అన్నాడీఎంకే 169 చోట్ల అభ్యర్థులను నిలిపింది. బీజేపీ 27స్థానాల్లో పోటీలో ఉంది. విజయ్ టీవీకే పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక, బెంగాల్‌లో తొలి దశలో 3.60 కోట్ల మంది ఓటర్లు పాలుపంచుకోనున్నారు. 1,478 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.