దేశాన్ని మోదీ నాశనం చేస్తున్నారు: ఖర్గే
ABN , Publish Date - Jun 22 , 2026 | 03:51 AM
ప్రధాని మోదీ భారత్‌ను.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు.
బెంగళూరు, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ భారత్‌ను.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు. ఈ ఇద్దరూ తాము మంచి మిత్రులమని చెప్పకొంటారని.. ఇద్దరూ తమ తమ దేశాలకు అప్రతిష్ఠ తెస్తున్నారని ఆరోపించారు. ఆదివారం బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్‌లో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ ప్రమాణ స్వీకార కార్యక్రమ సభలో ఖర్గే మాట్లాడారు. ‘ఆడ్వాణీ.. రాముడి గుడి కోసం దేశమంతటా యాత్ర చేశారు. అప్పట్లో ఇటుకలు, బంగారం విరాళాలుగా వచ్చాయి? అవి ఏమయ్యాయో తెలియదు. ప్రస్తుతం రామాలయ నిర్మాణానికి రూ.5 వేల కోట్ల విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. అర్చకులు డబ్బు దోచుకుంటున్నట్లు తెలిసింది. రాముడి పేరిట లూటీ జరుగుతోంది. విరాళాల పెట్టెల్లోని డబ్బు ఎక్కడికో వెళ్తోంది. దీని వెనుక మోదీ సొంత మనుషులు ఉన్నారా.. ఇంకెవరైనా ఉన్నారా అనేది దర్యాప్తు జరపాలి’ అని డిమాండ్ చేశారు. ఖర్గే మాట్లాడేందుకు లేచిన సమయంలో ‘డీకే డీకే’ అంటూ కొందరు కార్యకర్తలు బిగ్గరగా నినాదాలు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకరికోసం నినాదాలు చేస్తే మిగిలినవారు చెత్త ఊడ్చేందుకు వచ్చారా.. యూజ్‌లెస్ ఫెలోస్’ అంటూ ఖర్గే కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో సీఎం శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య తదితరులు పాల్గొన్నారు.