ఆ ఎన్నికలన్నీ చట్ట విరుద్ధమే!
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:32 AM
ఇటీవల జరిగిన ఎన్నికలన్నీ చట్టవిరుద్ధమేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆక్షేపించారు.
లోక్‌సభను, అసెంబ్లీలను రద్దు చేయాలి
బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలు జరపాలి: ఖర్గే
కలబురగి(కర్ణాటక), అక్టోబరు 3: ఇటీవల జరిగిన ఎన్నికలన్నీ చట్టవిరుద్ధమేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆక్షేపించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, అన్ని రాష్ట్రాల సీఎంల ఎన్నిక సైతం చట్టవిరుద్ధమేనన్నారు. లోక్‌సభను, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయాలని, తాజాగా బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. శనివారం కర్ణాటకలోని కలబురగిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఈవీఎంలు దుర్వినియోగం అయ్యాయని, ఈ విషయాన్ని ‘వాళ్ల సొంత మనుషులే’ చెబుతున్నారని పేర్కొన్నారు. సర్ ప్రక్రియలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ఒక పోలింగ్ బూత్ పరిధిలో 500 ఓట్లు తొలగించడం ఎలాంటి స్వేచ్ఛాయుత-నిష్పక్షపాత ఎన్నికలని ప్రశ్నించారు. సర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగిస్తాయని ప్రకటించారు. ఈనెల 6న ప్రతిపక్ష పార్టీల ఎంపీలందరూ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఆందోళనలు కొనసాగిస్తామని, ప్రతి రాష్ట్రంలోనూ ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు.