Share News

స్లో పాయిజన్‌లా పెట్రో ధరల పెంపు: ఖర్గే

ABN , Publish Date - May 27 , 2026 | 03:53 AM

ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ధ్వజమెత్తారు. గత పన్నెండేళ్లలో క్రూడాయిల్‌ ధరలు పడిపోయిన సమయంలో ఇంధన ధరలను...

స్లో పాయిజన్‌లా పెట్రో ధరల పెంపు: ఖర్గే

న్యూఢిల్లీ, మే 26: ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ధ్వజమెత్తారు. గత పన్నెండేళ్లలో క్రూడాయిల్‌ ధరలు పడిపోయిన సమయంలో ఇంధన ధరలను ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. పెట్రో ధరలను కొంచెం కొంచెంగా పెంచడాన్ని ఆయన ‘స్లో పాయిజన్‌’గా అభివర్ణించారు. ‘ఇది ప్రధాని మోదీ వ్యూహం. పేదలను చంపేందుకు ఒక విధమైన నెమ్మది విష ప్రయోగం(స్లో పాయిజనింగ్‌) లాంటిది’ అని ఖర్గే ఆరోపించారు. దేశాన్ని వినాశనం వైపు నెడుతున్నారని మండిపడ్డారు. పేపర్‌ లీకేజీల వ్యవహారంపై ఎందుకు దృష్టి సారించరని నిలదీశారు. ‘ఆయన (మోదీ) దేశాన్ని పాలించాలా? లేక పర్యాటకుడిలా ప్రపంచ దేశాలన్నింటికీ సందర్శించాలా?’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు ఖర్గే ‘ఎక్స్‌’ పోస్టులో పీఐబీ అధికారిక ప్రకటనను ఉటంకిస్తూ గతానికి, ఇప్పటికి ఉన్న ఇంధన ధరల్లో మార్పులను క్రూడాయిల్‌ ధరలతో పోల్చిచెప్పారు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ అధికారం చేపట్టిన 2014 మే 26న ముడి చమురు ధర బ్యారెల్‌కు 108.05 డాలర్లుగా, డాలర్‌-రూపీ మారకం రేటు రూ.58.59గా ఉండేదని పేర్కొన్నారు. ఆ సమయంలో పెట్రోల్‌ లీటర్‌ రూ.71.51కు, డీజిల్‌ రూ.59.71కు అందుబాటులో ఉండేదన్నారు. అయితే ఈ రోజున క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 99 డాలర్ల కంటే తక్కుగానే ఉందని, అయినప్పటికీ.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రూ.102,12, రూ.95.20కు పెరిగాయంటూ కేంద్రాన్ని దుయ్యబట్టారు.

Updated Date - May 27 , 2026 | 03:53 AM