కేరళ తదుపరి సీఎం ఎవరు?
ABN , Publish Date - May 05 , 2026 | 05:13 AM
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్)కు ముఖ్యమంత్రి ఎంపిక సంక్లిష్టంగా మారనుందన్న సంకేతాలు వస్తున్నాయి.
ముందు వరుసలో వీడీ సతీశన్.. మద్దతు పలికిన మిత్రపక్షం
తాము కూడా సిద్ధమేనంటున్న కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల
తిరువనంతపురం, మే 4: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్)కు ముఖ్యమంత్రి ఎంపిక సంక్లిష్టంగా మారనుందన్న సంకేతాలు వస్తున్నాయి. యూడీఎఫ్ కూటమి అధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం ప్రకారం గెలుపొందిన ఎమ్మెల్యేలను సంప్రదించి పార్టీ హైకమాండ్ సీఎం పీఠంపై తుది నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుంది. అయితే, కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం దక్కించుకుంటుందన్న ఎగ్జిట్ పోల్ సర్వేల అనంతరం.. ముఖ్యమంత్రి పీఠంపై పలువురు నాయకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో.. ఈ వ్యవహారంపై చర్చ ఊపందుకుంది. వీరిలో వీడీ సతీశన్ ముందు వరుసలో ఉండగా... కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల వంటి సీనియర్ నాయకులు కూడా సీఎం సీటుపై ఆశలు పెట్టుకున్నారు.
వీడీ సతీశన్: గత ఐదేళ్లుగా అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా వ్యవహరించిన వదస్సేరి దామోదరన్(వీడీ) సతీసన్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా బలమైన గళం వినిపించారు. యూడీఎఫ్ కూటమిలో తన స్థానాన్ని, పాపులారిటీని బలోపేతం చేసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో సతీశన్‌ను బలమైన కాంగ్రెస్ నాయకుడిగా ప్రజలు పేర్కొనడం గమనార్హం. కాగా, యూడీఎఫ్ మిత్రపక్షం ఐయూఎంఎల్(ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్) సైతం సతీశన్‌కు మద్దతు పలుకుతోంది. నిజానికి ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్న చాలా మంది నాయకులు ముస్లిం లీగ్ మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో లీగ్ స్వయంగా సతీశన్‌కు దన్నుగా నిలవడం గమనార్హం.
రమేశ్ చెన్నితల: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా రమేశ్ చెన్నితలకు బలమైన మద్దతు ఉంది. అంతేకాదు.. పార్టీ నాయకులతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని ప్రకటించుకున్నారు. అయితే, సీఎం రేసులోకి కేసీ వేణుగోపాల్ సైతం దిగడంతో ఈ వ్యవహారం పార్టీకి సంక్లిష్టంగా మారుతోంది. అదేసమయంలో తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తున్నా.. ఈ చర్చకు ఆయన దూరంగా ఉన్నారు. పార్టీ అధినాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇదిలావుంటే, కాంగ్రెస్ మిత్రపక్షం ఐయూఎంఎల్.. సతీశన్‌కు మద్దతు పలకడంపై కొందరు నేతలు పెదవి విరుస్తున్నారు. అంతర్గతంగా తీసుకునే నిర్ణయంపై.. బహిరంగ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయని పేర్కొంటున్నారు.