Share News

పేదలకు ఏడాదికి రెండు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:02 AM

కేరళలో ఏప్రిల్‌ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీయే మేనిఫెస్టోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ స్థానికంగా మంగళవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో....

పేదలకు ఏడాదికి రెండు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

  • మహిళలకు ఆరోగ్య సురక్ష కార్డు మంజూరు

  • ప్రతి నెలా రూ.2,500తో రీచార్జ్‌

  • 70 ఏళ్లు నిండిన పేద మహిళలకు 3 వేల పెన్షన్‌.. రాష్ట్రంలో ప్రార్థనా స్థలాల పరిరక్షణ

  • శబరిమలలో అవినీతికి అడ్డుకట్ట

  • శబరిమల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ మిషన్‌ ఏర్పాటు.. రాష్ట్రానికి ఏఐఐఎంఎస్‌

  • తిరువనంతపురం-కన్నూర్‌ మధ్య హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌

  • కేరళలో ఎన్డీయే మేనిఫెస్టో విడుదల

తిరువనంతపురం, మార్చి 31: కేరళలో ఏప్రిల్‌ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీయే మేనిఫెస్టోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ స్థానికంగా మంగళవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఏడాదికి రెండు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాల మహిళలకు భక్ష్య ఆరోగ్య సురక్ష కార్డుని మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి నెలా ఆ కార్డుని రూ.2,500తో రీచార్జ్‌ చేస్తామని, ఆ మొత్తాన్ని మందులు, సరుకుల కొనవచ్చని చెప్పారు. 70ఏళ్లు నిండిన పేద మహిళలకు రూ.3000 సంక్షేమ పెన్షన్‌ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ఏఐఐఎంఎ్‌సని మంజూరు చేస్తామని పేర్కొన్నారు. తిరువనంతపురం-కన్నూర్‌లను కలుపుతూ హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ప్రతి కుటుంబానికి 20వేల లీటర్ల నీరు ఉచితంగా ఇస్తామని అన్నారు. ముళ్లపెరియార్‌ డ్యామ్‌ నీటిని తమిళనాడుకు అందించడంతోపాటు కేరళకు దాని ముంపు నుంచి భద్రత కల్పిస్తామని తెలిపారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ ప్రభుత్వాలు సాధించింది ఏమీ లేదని, పారిశ్రామికంగా, ఆర్థికంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయని విమర్శించారు. ఈ రెండు పక్షాల మ్యాచ్‌ ఫిక్సింగ్‌ గేమ్‌ల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఓ వర్గాన్ని సంతృప్తిపరిచేందుకే అవి పనిచేశాయని, దీంతో ఇతర వర్గాల విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ప్రార్థనా స్థలాలకు రక్షణ కల్పిస్తామని, శబరిమల, గురువాయూర్‌ తదితరప్రార్థనా స్థలాల నిర్వహణలో భక్తుల భాగస్వామ్యం పెంచి వాటిని కాపాడతామని హామీ ఇచ్చారు. శబరిమలలో బంగారం చోరీ విషయంలో సీబీఐ విచారణను సత్వరం పూర్తిచేసి అక్కడ అవినీతిని అరికడతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అక్కడికి భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు తగిన వసతులు కల్పించేందుకు ‘‘శబరిమల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ మిషన్‌’’ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం విశేషం. ఇతర హామీల్లో... కోచి మెట్రో తదుపరి దశలను పూర్తిచేయడంతోపాటు తిరువనంతపురం, కోజికోడ్‌లలో మెట్రో సేవలను అందిస్తామన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 04:02 AM