సెన్సార్‌బోర్డు.. బుర్ర పెట్టి సినిమా చూసినట్టు లేదు!
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:07 AM
ది కేరళ స్టోరీ 2-గోస్ బియాండ్’ సినిమా విడుదలపై కేరళ హైకోర్టు రెండు వారాలపాటు తాత్కాలిక స్టే విధించింది. దీంతో శుక్రవారం విడుదల కావాల్సి ఉన్న ఆ సినిమా నిలిచిపోయింది....
కేరళ స్టోరీ-2కు సెన్సార్ సర్టిఫికెట్ జారీపై కేరళ హైకోర్టు ఆగ్రహం
కొచి, ఫిబ్రవరి 26: ‘ది కేరళ స్టోరీ 2-గోస్ బియాండ్’ సినిమా విడుదలపై కేరళ హైకోర్టు రెండు వారాలపాటు తాత్కాలిక స్టే విధించింది. దీంతో శుక్రవారం విడుదల కావాల్సి ఉన్న ఆ సినిమా నిలిచిపోయింది. ఈ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు.. సినిమాను బుర్ర పెట్టి చూసినట్టు లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేరళ స్టోరీ-2కి సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద జస్టిస్ బెచు కురియన్ థామస్ గురువారం విచారణ జరిపారు. సెన్సార్ బోర్డు మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విడుదలయ్యే సినిమాలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయకూడదన్న సెన్సార్ మార్గదర్శకాలను స్వ యంగా సెన్సార్‌బోర్డే (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్- సీబీఎ్‌ఫసీ) పక్కనపెట్టిందని పేర్కొన్నారు. సమాజంలో అశాంతిని రేకెత్తించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(ఎ) పేర్కొనే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. వేర్వేరు మతాలకు చెందిన ప్రజలతో కేరళలో పూర్తి సామరస్య వాతావరణం నెలకొని ఉందని, అటువంటి కేరళను నెగెటివ్‌గా చూపించి భావోద్రేకాలు రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. సాధారణంగా.. సినిమాల విడుదలపై తాము జోక్యం చేసుకోమని, కానీ, కేరళ స్టోరీ-2 వల్ల సమాజంలో మతకల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందన్న పిటిషనర్ల ఆందోళన నేపథ్యంలోనే తాము ముందకు వచ్చామని న్యాయమూర్తి పేర్కొన్నారు. కేరళ స్టోరీ-2 సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయటాన్ని సవాల్ చేస్తూ శ్రీదేవ్ నంబూద్రి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ మీద రెండువారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని జస్టిస్ కురియన్ థామస్ ఆదేశించారు. శ్రీదేవ్ నంబూద్రి, సెన్సార్‌బోర్డు, సినిమా నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షాల వాదనలు విని సదరు నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. అప్పటి వరకూ సినిమా విడుదల చేయటానికి వీల్లేదని, ఈ మేరకు స్టే విధిస్తున్నామంటూ ఆదేశాలు జారీ చేశారు. శ్రీదేవ్ నంబూద్రి, ఫ్రెడ్డీ ఫ్రాన్సిస్, అతుల్ రాయ్ పిటిషన్లు దాఖలు చేయగా.. రాయ్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి మిగిలిన ఇద్దరి పిటిషన్ల మీద విచారణ జరిపారు. కాగా, సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ.. కేరళ స్టోరీ-2 నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ పరిగణనలోకి తీసుకుంది.