Share News

కేరళ సీఎంగా సతీశన్‌ ప్రమాణం

ABN , Publish Date - May 19 , 2026 | 04:13 AM

కేరళ సీఎంగా వీడీ సతీశన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. దీంతో కాంగ్రెస్‌....

కేరళ సీఎంగా సతీశన్‌ ప్రమాణం

  • ఆయనతో పాటు ప్రమాణం చేసిన 20 మంది మంత్రులు.. ఖర్గే, రాహుల్‌, రేవంత్‌ రెడ్డి, సిద్దరామయ్య హాజరు

  • జూన్‌ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు

  • తొలి కేబినెట్‌ భేటీలోనే కీలక నిర్ణయాలు

తిరువనంతపురం, మే 18: కేరళ సీఎంగా వీడీ సతీశన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. దీంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) కూటమి దశాబ్ద కాలం తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. తిరువనంతపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ సతీశన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మహోత్సవానికి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు మాజీ సీఎం పినరయి విజయన్‌, లెఫ్ట్‌ ఫ్ట్రంట్‌ నాయకులు, బీజేపీ ప్రతినిధులు రావడం విశేషం. నూతన మంత్రి వర్గంలో కాంగ్రెస్‌ నుంచి 11 మంది, ఐయూఎంల్‌ నుంచి ఐదుగురు, ఇతర మిత్ర పక్షాల నేతలు నలుగురు చోటు దక్కించుకున్నారు. ఇందులో 14 మంది కొత్తవారు ఉండగా, ఇద్దరు మహిళలు, ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే సీఎం వీడీ సతీశన్‌ అధ్యక్షతన తొలి కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ ప్రకటించిన ఐదు గ్యారంటీలలో రెండింటిని తక్షణమే అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కర్ణాటక, తెలంగాణ తరహాలో జూన్‌ 15 నుంచి కేరళ వ్యాప్తంగా మహిళలకు కేఎ్‌సఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. వృద్ధుల సంరక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా ఒక ప్రత్యేక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీర్ఘకాలంగా ఆందోళనలు చేస్తున్న ఆశా కార్యకర్తల గౌరవ వేతనాన్ని నెలకు రూ.3వేలకు పెంచారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, పాఠశాలల వంట సిబ్బంది, ప్రీ-ప్రైమరీ టీచర్లు, ఆయాల వేతనాలను నెలకు రూ.1,000 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2023లో నవ కేరళ యాత్ర సందర్భంగా అప్పటి సీఎం పినరయి విజయన్‌ గన్‌ మెన్లు యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై చేసిన దాడి కేసును పునర్విచారించడానికి సిట్‌ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. నూతన అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సీనియర్‌ ఎమ్మెల్యే జి.సుధాకరన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఈనెల 21న నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, 22న స్పీకర్‌ ఎన్నిక జరుగుతుందని సీఎం సతీశన్‌ తెలిపారు. అలాగే 29న గవర్నర్‌ పాలసీ ప్రసంగం ఉంటుందన్నారు.


విద్యార్థి నేత నుంచి ముఖ్యమంత్రి వరకు..

ఎర్నాకుళం జిల్లా నెట్టూరులో 1964లో వీడీ సతీశన్‌ జన్మించారు. ఎస్‌హెచ్‌ కాలేజీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో ఎన్‌ఎ్‌సయూఐ విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సతీశన్‌, 2001లో కొచ్చి సమీపంలోని పరవూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో ఎన్నడూ మంత్రి పదవి చేపట్టకపోయినప్పటికీ, ఐదేళ్ల క్రితం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆయన చూపిన ప్రతిభే సతీశన్‌ను ఈరోజు సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అసెంబ్లీలో పినరయి విజయన్‌ ప్రభుత్వంపై అవినీతి, శాంతి భద్రతలు, పరిపాలనాపరమైన వైఫల్యాలను ఎత్తి చూపుతూ సతీశన్‌ చేసిన పోరాటం కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికల ప్రచారంలో ‘‘యూడీఎఫ్‌ అధికారంలోకి రాకపోతే రాజకీయ వనవాసానికి వెళ్తాను’’ అని ఆయన సవాల్‌ చేశారు. అన్నట్టుగానే కూటమిని వంద సీట్లకు పైగా దాటించి, కేరళలో కాంగ్రెస్‌ పునరుజ్జీవనానికి నిజమైన సారథిగా నిలిచారు.

Updated Date - May 19 , 2026 | 05:45 AM