Share News

ఎన్నికల సంఘం సీఈవోకు సీఎం కార్యదర్శిగా అవకాశం

ABN , Publish Date - May 27 , 2026 | 03:55 AM

కేరళ సీఎం వీడీ సతీశన్‌ తన కార్యదర్శిగా ఎన్నికల సంఘం రాష్ట్ర మాజీ ప్రధానాధికారి రతన్‌ యు.కేల్కర్‌ను నియమించుకోవడం తీవ్ర వివాదానికి కారణమైంది.

ఎన్నికల సంఘం సీఈవోకు సీఎం కార్యదర్శిగా అవకాశం

  • నియామకంపై కేరళలో దుమారం

తిరువనంతపురం, మే 26: కేరళ సీఎం వీడీ సతీశన్‌ తన కార్యదర్శిగా ఎన్నికల సంఘం రాష్ట్ర మాజీ ప్రధానాధికారి రతన్‌ యు.కేల్కర్‌ను నియమించుకోవడం తీవ్ర వివాదానికి కారణమైంది. శనివారం బదిలీల్లో ఆయన్ను సీఎంవో కార్యదర్శిగా నియమించగా, ఆదివారమే ఆయన బాధ్యతలను స్వీకరించి, ముఖ్యమంత్రితో ఫోటో దిగారు. ఆ ఫోటోను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్‌ స్పందించారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఎన్నికల సంఘం అధికారులకు కీలక పదవులిస్తే రాహుల్‌గాంధీ తప్పుబట్టారని గుర్తు చేశారు. కేరళలో యూడీఎఫ్‌కు 102 సీట్లు రాగానే ఆ ఎన్నికలను నిర్వహించిన అధికారికి ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవి ఇవ్వడం ద్వంద్వ ప్రమాణమే అవుతుందన్నారు. ఇటీవలి ఎన్నికల్లో వేల మందికి ఓటుహక్కును నిరాకరించారని కేల్కర్‌పై ఆరోపణలు ఉన్నాయని, ఈ నియామకం వెనుక ఉన్న డీల్‌ త్వరలో బయట పడుతుందని గోవిందన్‌ అన్నారు. కేరళ సీఎం పదవికి చివరి వరకు పోటీపడిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ఇది పాలనాపరమైన నిర్ణయమని దాటవేశారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, సమర్థుడైన అధికారికి అవకాశం ఇచ్చామని కాంగ్రెస్‌ ప్రభుత్వం సమర్థించుకుంది.

Updated Date - May 27 , 2026 | 03:55 AM