కేజ్రీవాల్‌కు కోర్టు ధిక్కార నోటీసులు
ABN , Publish Date - May 20 , 2026 | 02:46 AM
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సహా మద్యం పాలసీ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న పలువురు ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం ‘నేరపూరిత కోర్టు ధిక్కార’..
జస్టిస్ మనోజ్ జైన్‌కు ఢిల్లీ మద్యం కేసు విచారణ బాధ్యతలు
న్యూఢిల్లీ, మే 19: ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సహా మద్యం పాలసీ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న పలువురు ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం ‘నేరపూరిత కోర్టు ధిక్కార’ నోటీసులు పంపించింది. ఈ నోటీసులపై 4వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ నవీన్, జస్టిస్ రవీందర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంతపై ఆప్ నేతలు మాట్లాడిన వీడియోలను భద్రపర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట విచారణకు హాజరు కాబోమని కేజ్రీవాల్, సిసోదియా, దుర్గేశ్ పాఠక్ తదితర ఆప్ నేతలు బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఆమెపై పలు ఆరోపణలు చేశారు. విచారణ జడ్జిపై వారు చేసిన ఈ ఆరోపణలు, చేసిన అవమానకర వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయంటూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆయా ఆప్ నేతలపై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశించారు. తర్వాత, మద్యం పాలసీ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇక నుంచి జస్టిస్ మనోజ్ జైన్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ కేసులో విచారణ బెంచ్ మారిన విషయాన్ని కేజ్రీవాల్ సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న 23మందికి తెలియజేయాలని జస్టిస్ మనోజ్ జైన్ మంగళవారం సీబీఐని ఆదేశించారు. పిటిషన్‌పై మే 25 విచారణ ప్రారంభిస్తామన్నారు.