Ahmad Sheikh: అయోధ్య రామ మందిరంలో నమాజ్ చేసేందుకు కశ్మీర్ వ్యక్తి ప్రయత్నం
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:10 AM
అయోధ్యలోని రామ మందిరం కాంప్లెక్స్‌లో కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం సృష్టించింది.
అహ్మద్ షేక్‌ను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
మా నాన్న మానసిక స్థితి సరిగా లేదు.. షేక్ కుమారుడి వెల్లడి
అయోధ్య, శ్రీనగర్, జనవరి 10: అయోధ్యలోని రామ మందిరం కాంప్లెక్స్‌లో కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం సృష్టించింది. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన అహ్మద్ షేక్(55) అనే వ్యక్తి అత్యంత కట్టుదిట్టమైన ఆలయ ప్రాంగణంలోకి శనివారం ప్రవేశించాడు. ఆ తర్వాత సీతా రసోయి ప్రాంతానికి సమీపంలో కూర్చున్నాడు. అనంతరం నమాజ్ చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆలయ భద్రతా సిబ్బంది అతడి కదలికలను గుర్తించి వెంటనే అక్కడకు చేరుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. అహ్మద్ షేక్‌ను అడ్డుకున్న సమయంలో నినాదాలు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఏమని నినాదాలు చేశాడన్న దానిపై స్పష్టత లేదు. కాగా ఆ వ్యక్తి ఈ చర్యకు పాల్పడటం వెనకున్న ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు దర్యాప్తు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రశ్నిస్తున్నాయని పోలీసులు తెలిపారు. తాను అజ్మీర్‌కు వెళ్తున్నట్టుగా ఆ వ్యక్తి విచారణ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై జిల్లా పాలనా యంత్రాంగం గానీ, రామ మందిరం ట్రస్ట్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా తన తండ్రి అహ్మద్ షేక్ మానసిక స్థితి సరిగా లేదని, కొన్నాళ్లుగా ఆయన ఇంట్లో ఉండటం లేదని, తరచుగా మసీదులకు వెళ్తుంటారని అతని కుమారుడు ఇమ్రాన్.. షోపియాన్‌లోని తన నివాసంలో విలేకరులతో అన్నారు.