Share News

కాశ్మీర్‌లో హైఅలర్ట్‌.. రెండో రోజూ కఠిన ఆంక్షలు

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:39 AM

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ హత్యకు నిరసనగా కాశ్మీర్‌లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరుసగా రెండో రోజూ కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.

కాశ్మీర్‌లో హైఅలర్ట్‌.. రెండో రోజూ కఠిన ఆంక్షలు

శ్రీనగర్‌, మార్చి 3: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ హత్యకు నిరసనగా కాశ్మీర్‌లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరుసగా రెండో రోజూ కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఖమేనీ మృతితో సోమవారం వెల్లువెత్తిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆరుగురు భద్రతా సిబ్బంది సహా 14మంది గాయపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీనగర్‌తో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించిన ప్రభుత్వం, శాంతి భద్రతలను పర్యవేక్షిస్తోంది. ఆంక్షల కారణంగా వ్యాపార సముదాయాలు మూతపడటంతో పాటు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. కాశ్మీర్‌లోని అన్ని విద్యాసంస్థలను మార్చి 7వరకు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి మంగళవారం ప్రకటించారు. కొన్ని చోట్ల ఇంటర్నెట్‌ సేవలపై పరిమితులు విధించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని, శాంతికి విఘాతం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా అడ్డు కోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్ర తలు కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, నిరసనల ముసుగులో వదంతులు వ్యాపింపజేస్తున్న కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Mar 04 , 2026 | 03:39 AM