కర్ణాటకలో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించే కుట్ర
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:25 AM
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ప్రాథమిక ఓటు హక్కును కాలరాసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.
బతికున్నవారి పేరిట ‘చనిపోయాను’ అంటూ దరఖాస్తులు: కాంగ్రెస్ ఆరోపణలు
న్యూఢిల్లీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ప్రాథమిక ఓటు హక్కును కాలరాసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా భారీ అక్రమాలు జరుగుతున్నాయని.. ఇది ‘ఓటు చోరీ’ కోసం రూపొందించిన పక్కా ప్రణాళిక అని ఆరోపించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాపై కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసింది. బతికి ఉన్నవారి పేరిట ‘నేను చనిపోయాను. నా పేరు తొలగించండి’ అని పేర్కొంటూ ఫారమ్ 7 ద్వారా 37 దరఖాస్తులు దాఖలయ్యాయని.. ఆ ఓటర్లకు తెలియకుండా ఈ తంతు జరిగిందని తెలిపింది. అలాగే, భార్యాభర్తలు (334 జంటలు) పరస్పరం ఒకరినొకరు చనిపోయారని సమర్పించిన నకిలీ దరఖాస్తులను రికార్డుల్లో చూపిస్తున్నారని పేర్కొంది. ఎన్నికల సంఘం సరైన డేటాను అందించకుండా, ఈ అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా ఆరోపించారు.