Share News

మేం వీఐపీలం.. క్యూలో నిలబడం..5 టికెట్లివ్వండి

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:46 AM

మేం వీఐపీలం. క్యూలో నిలబడి ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్లు కొనుగోలు చేయలేం. మాకు కనీసం ఐదు టికెట్లు ఇవ్వాలి’ అని కర్ణాటక శాసనసభలో కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

మేం వీఐపీలం.. క్యూలో నిలబడం..5 టికెట్లివ్వండి

  • ఐపీఎల్‌ టికెట్లపై కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేల డిమాండ్‌

బెంగళూరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ‘మేం వీఐపీలం. క్యూలో నిలబడి ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్లు కొనుగోలు చేయలేం. మాకు కనీసం ఐదు టికెట్లు ఇవ్వాలి’ అని కర్ణాటక శాసనసభలో కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాలలో భాగంగా గురువారం చివరిరోజు బెంగళూరు అభివృద్ధిపై చర్చ జరుగుతున్న సమయంలో ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా బాగల్కోటె జిల్లా హునగుంద కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్‌ ఓ కొత్త ప్రతిపాదన చేశారు. తమతోపాటు తమ కుటుంబ సభ్యులు క్రికెట్‌ చూసేందుకు కనీసం ఐదు టికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వ అనుమతులతోనే మ్యాచ్‌లు నిర్వహించేందుకు అవకాశం దక్కిందని, అటువంటిది తమకే టికెట్లు ఇవ్వకుంటే ఎలాగని డిప్యూటీ సీఎం శివకుమార్‌ను ప్రశ్నించారు. దీనిగురించి వచ్చే సమావేశాలలో చర్చిద్దామని ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. దీంతో శనివారం మ్యాచ్‌ ఉందని, మరోసారి సమావేశాలు జరిగేలోగా ఐపీఎల్‌ ముగుస్తుందని పలువురు సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత అశోక్‌ జోక్యం చేసుకుని, ఎమ్మెల్యేలకు ఐపీఎల్‌ టికెట్లు ఇప్పించాలని కోరారు. ఎమ్మెల్యేల డిమాండ్‌పై బెంగళూరు దక్షిణ ఎంపీ, బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షుడు తేజస్విసూర్య తీవ్రంగా మండిపడ్డారు. వారి తీరుతో శాసనసభ గౌరవానికి భంగం కలుగుతోందని విమర్శించారు.

Updated Date - Mar 28 , 2026 | 04:46 AM