వెనక్కి తగ్గిన రామలింగారెడ్డి
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:02 AM
తనకు ఇష్టం లేని శాఖ కేటాయించారంటూ మంత్రి పదవికి రాజీనామా చేసిన కర్ణాటక నేత రామలింగారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
రాజీనామా ఉపసంహరణ
బెంగళూరు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): తనకు ఇష్టం లేని శాఖ కేటాయించారంటూ మంత్రి పదవికి రాజీనామా చేసిన కర్ణాటక నేత రామలింగారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అధిష్ఠానం జోక్యంతో రాజీనామాను ఉపసంహరించుకున్నారు. సీఎం శివకుమార్‌తోపాటు ప్రమాణ స్వీకారం చేసిన 13 మంది మంత్రులకు ఈ నెల 4వ తేదీ రాత్రి శాఖలను కేటాయించారు. బెంగళూరు నగరాభివృద్ధి శాఖను ఆశించిన రామలింగారెడ్డికి భారీ జలవనరులశాఖను ఇచ్చారు. దీంతో ఆయన అలకబూని, శుక్రవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే రోజున ఖర్గే రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తుండటంతో రాహుల్‌గాంధీ తదితరులు బెంగళూరుకు వచ్చారు. రామలింగారెడ్డి రాజీనామా విషయంపై రాహుల్ ఆరా తీశారు. ఈ క్రమంలోనే రామలింగారెడ్డిని శుక్రవారం రాత్రి జయనగర్‌లోని ఓ హోటల్‌కు రప్పించుకుని సుర్జేవాలా, శివకుమార్ చర్చలు జరిపారు. దీంతో, రామలింగారెడ్డి వెనక్కి తగ్గారు.