కుమార్తె తీసిచ్చిన లాటరీ టికెట్..
ABN , Publish Date - Feb 06 , 2026 | 02:40 AM
ఐదేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నా నిరాశే వెక్కిరించేది..! అయితే ఇటీవల తన కుమార్తె చేతితో తీసిచ్చిన ఓ లాటరీ టికెట్‌తో ఆ వ్యక్తి జాక్‌పాట్ కొట్టేశారు..!
కర్ణాటక వాసికి 49 కోట్ల జాక్‌పాట్..!
యూఏఈ బిగ్ టికెట్ లక్కీ డ్రాలో విజేత
మిత్రుడితో కలసి పంచుకోవాలని నిర్ణయం
బెంగళూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నా నిరాశే వెక్కిరించేది..! అయితే ఇటీవల తన కుమార్తె చేతితో తీసిచ్చిన ఓ లాటరీ టికెట్‌తో ఆ వ్యక్తి జాక్‌పాట్ కొట్టేశారు..! యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన బిగ్ టికెట్ లక్కీ డ్రాలో కర్ణాటక వాసి రూ.49 కోట్ల లాటరీ (2 కోట్ల దిర్హంలు) గెలుచుకున్నారు. ఉడుపి జిల్లా కటపాడి మట్టు ప్రాంతానికి చెందిన శాంతను శెట్టిగార్ వ్యాపార నిమిత్తం కొన్నేళ్లుగా ఒమన్‌లో ఉంటున్నారు. లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉన్న ఆయన ఐదేళ్లుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల 283వ సీరియల్ టికెట్ నంబరు 305810 లాటరీని కొనుగోలు చేశారు. అబుదాబిలో ఈ నెల 3న తీసిన లక్కీ డ్రాలో శెట్టిగార్ 2 కోట్ల దిర్హాంలు గెలుచుకోగా.. మరో ఐదుగురు లగ్జరీ కారుతోపాటు ఒక్కొక్కరూ 10 లక్షల దిర్హాంలు గెలుచుకున్నారు. ఈ టికెట్‌ను తన స్నేహితుడితో కలసి కొనుగోలు చేశానని, వచ్చే ప్రైజ్‌మనీని తామిద్దరం చెరి సంగం పంచుకుంటామని శెట్టిగార్ తెలిపారు. తన విజయానికి ఆ రోజు తన కుమార్తె తీసిన టికెట్ కారణమని వెల్లడించారు.