Share News

రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దు!

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:45 AM

ఎస్సీ, ఎస్టీ సహా అన్ని వర్గాల రిజర్వేషన్లు 50శాతానికి మించరాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లను 56 శాతానికి పెంచుతూ 2023 నాటి ప్రభుత్వం తెచ్చిన ‘కర్ణాటక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌’ చట్టాన్ని రద్దుచేసింది.

రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దు!
KARNATAKA HC

  • జనాభా పెరిగినా పరిమితి తప్పదు: కర్ణాటక హైకోర్టు

బెంగళూరు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ సహా అన్ని వర్గాల రిజర్వేషన్లు 50శాతానికి మించరాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లను 56 శాతానికి పెంచుతూ 2023 నాటి ప్రభుత్వం తెచ్చిన ‘కర్ణాటక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌’ చట్టాన్ని రద్దుచేసింది. ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. రాష్ట్ర విద్యాసంస్థల్లో సీట్లు, ఉద్యోగాల విషయంలో ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 17 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 3 శాతం నుంచి 7 శాతానికి పెంచుతూ 2023, జనవరి 12న అప్పటి సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వం చట్టం చేసింది. ఈ మేరకు రిజర్వేషన్లను 50 నుంచి 56 శాతానికి పెంచుతూ గెజిట్‌ జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ అంబేడ్కర్‌ ఎస్సీ కులాల సమాఖ్య అధ్యక్షుడు మహేంద్రకుమార్‌ సహా పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటికీ కలిపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విభు బఖ్రు, జస్టిస్‌ కేఎస్‌ హేమలేఖతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో ఇంద్రా సాహ్ని, ఎం. నాగరాజ్‌ కేసు తీర్పులను హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తాత్కాలిక మార్గదర్శకం కాదని, సమానత్వాన్ని కాపాడేందుకు పెట్టిన కీలక నిబంధన అని ధర్మాసనం పేర్కొంది. రిజర్వేషన్‌ అనేది వెనుకబడిన కులాల అభ్యున్నతికి మార్గదర్శకం కావాలని, కానీ ఇది 50 శాతానికి మించితే సాధారణవర్గాల అభ్యర్థుల పట్ల తారతమ్యం చూపినట్లు అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated Date - Oct 14 , 2026 | 06:45 AM