Share News

సభలో ఉన్నది రెండు నిమిషాలే!

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:52 AM

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ‘ప్రభుత్వం వర్సెస్‌ గవర్నర్‌’ అన్నట్లుగా మొదలయ్యాయి. శాసనసభ సమావేశాలలో గవర్నర్‌ పాల్గొంటారా లేదా అనే ఉత్కంఠ గురువారం చివరిక్షణం దాకా కొనసాగింది.

సభలో ఉన్నది రెండు నిమిషాలే!

  • ప్రసంగ పాఠం చదవకుండానే కర్ణాటక గవర్నర్‌ నిష్క్రమణ

బెంగళూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ‘ప్రభుత్వం వర్సెస్‌ గవర్నర్‌’ అన్నట్లుగా మొదలయ్యాయి. శాసనసభ సమావేశాలలో గవర్నర్‌ పాల్గొంటారా లేదా అనే ఉత్కంఠ గురువారం చివరిక్షణం దాకా కొనసాగింది. నిర్దేశించిన సమయం 11 గంటలకు లోక్‌భవన్‌ నుంచి గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లోత్‌ బయలుదేరి, విధానసౌధ ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం సిద్దరామయ్య, స్పీకర్‌ తదితరులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. సభలో గవర్నర్‌ అందరికీ అభివాదం చేసుకుంటూ స్పీకర్‌ స్థానానికి చేరుకున్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ పుస్తకంలోని మొదటి పేజీ తొలి పేరాలో ఉండే ‘పరిషత్‌ సభాపతి, శాసనసభ స్పీకర్‌, గౌరవ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఉభయ సభల సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం’ అని చదివారు. తర్వాత ప్రసంగాన్ని పూర్తిగా వదిలేశారు. 122 సబ్జెక్టులలో 46వ పేజీలో చివర ఉన్న ‘జై హింద్‌, జై కర్ణాటక’ అని ముగించారు. సభ లో గవర్నర్‌ కేవలం రెండు నిమిషాలు గడిపారు. ఆ తర్వాత వెళ్లిపోతుండగా కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట జరిగింది. మార్షల్స్‌ భద్రత మధ్య గవర్నర్‌ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లారు. సభా సంప్రదాయం ప్రకారం గవర్నర్‌ జాతీయ గీతాన్ని ఆలపించలేదని కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్‌ను అడ్డుకుని, సభా నిబంధనలను ఉల్లంఘించారని బీజేపీ, జేడీఎస్‌ సభ్యులు విరుచుకుపడ్డారు. కాగా, తోపులాటలో కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్‌ చొక్కా వెనుకభాగాన చిరిగిపోయింది. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ’, మరికొన్ని అంశాలను గవర్నర్‌ చదవాల్సిన పుస్తకంలో రెండో పేజీలో పొందుపరిచారు. దీంతో గవర్నర్‌ చదవడం ప్రారంభిస్తే, వెంటనే ఆ అంశాలను ప్రస్తావించాల్సి వచ్చేది. అందుకే ఏ ఒక్క అంశాన్నీ చదవకుండా ఆయన వెళ్లిపోయారు.

Updated Date - Jan 23 , 2026 | 03:52 AM