Share News

జంధ్యం తొలగించాకే పరీక్షకు అనుమతి

ABN , Publish Date - Apr 26 , 2026 | 03:57 AM

వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం కర్ణాటక వ్యాప్తంగా నిర్వహించిన కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీఈటీ)లో జంధ్యం తొలగింపు వివాదం చోటు చేసుకుంది.

జంధ్యం తొలగించాకే పరీక్షకు అనుమతి

  • బెంగళూరులో జరిగిన కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో వివాదం

బెంగళూరు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం కర్ణాటక వ్యాప్తంగా నిర్వహించిన కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీఈటీ)లో జంధ్యం తొలగింపు వివాదం చోటు చేసుకుంది. తనిఖీల సమయంలో కొందరు విద్యార్థులను జంధ్యం తొలగించిన తర్వాతే, పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. బెంగళూరు నగరంలోని కృపానిధి కళాశాల పరీక్షా కేంద్రానికి వచ్చిన ఓ విద్యార్థికి జంధ్యం తొలగించాలని సిబ్బంది సూచించారు. కాసేపు వేచివున్నా వారి తీరులో మార్పు లేకపోవడంతో ఆ విద్యార్థి జంధ్యాన్ని తొలగించి లోపలికి వెళ్లారు. మరో నలుగురు విద్యార్థులు చేతి మణికట్టుకు కట్టుకున్న దారాలను తొలగించారు. ఇలాంటి సంఘటనే చిక్కబళ్లాపుర పరిధిలోని నాగార్జున కళాశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. కృపానిధి కళాశాలలో జంధ్యం తొలగించిన వివాదంపై బాధిత విద్యార్థి మడివాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాసనసభ ప్రతిపక్ష నేత అశోక్‌, బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్విసూర్య, నగర పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌ కుమార్‌ సింగ్‌ను కలసి హిందూ వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి సుధాకర్‌ మీడియాతో మాట్లాడుతూ వివాదానికి బాధ్యులైన కృపానిధి సంస్థ అధ్యాపకుడు సుధీర్‌, క్లర్క్‌ సరిత, అటెండర్‌ గిరిజను సస్పెండ్‌ చేశామన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 03:57 AM