Share News

దేశంలోనే తొలిసారిగా ప్రజా సేవకు మంత్రిత్వ శాఖ

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:28 AM

దేశంలోనే తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వం ప్రజాసేవ పేరిట కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సీఎం డీకే శివకుమార్‌ అధ్యక్షతన శనివారం జరిగిన రెండో మంత్రివర్గ...

దేశంలోనే తొలిసారిగా ప్రజా సేవకు మంత్రిత్వ శాఖ

  • కర్ణాటక క్యాబినెట్‌ నిర్ణయం

బెంగళూరు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వం ప్రజాసేవ పేరిట కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సీఎం డీకే శివకుమార్‌ అధ్యక్షతన శనివారం జరిగిన రెండో మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ప్రజాసేవ శాఖకు మంత్రిని నియమిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటించే ప్రతిచోటుకూ ప్రజలు వినతిపత్రాలతో వస్తారని, వారి సమస్యలు పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజాసేవ మంత్రిత్వ శాఖకు ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించామని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు వారానికి ఒక రోజు ఒక తాలూకాలో పర్యటించి, అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా జన స్పందన సభలు నిర్వహిస్తామన్నారు. ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసి, మంత్రిని నియమిస్తున్నామని వెల్లడించారు. యూపీఎస్సీ పరీక్షలకు శిక్షణ పొందే వారికోసం ఢిల్లీలో రూ.80 కోట్లతో ప్రత్యేక భవనాన్ని నిర్మించనున్నట్టు సీఎం శివకుమార్‌ తెలిపారు.

Updated Date - Jun 21 , 2026 | 04:28 AM