Share News

ఏకతాటిపై నిలుద్దాం.. సత్తా చాటుదాం

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:11 AM

చేయి చేయి కలిపితే పిడికిలి. నువ్వు, నేను కలిస్తే మనం. మనం మనం కలిస్తే జనం. జనం జనం కలిస్తే ప్రభంజనం... అలా ప్రభంజనంలా కమ్మవారంతా కలిసి రండి.

ఏకతాటిపై నిలుద్దాం.. సత్తా చాటుదాం

  • కమ్మవారమంతా చేయి చేయి కలుపుదాం.. కేజీఎఫ్‌ అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్‌ పిలుపు

  • తమిళనాడులో ‘కమ్మ మహానాడు’

  • ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కమ్మవారు

చెన్నై, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ‘‘చేయి చేయి కలిపితే పిడికిలి. నువ్వు, నేను కలిస్తే మనం. మనం మనం కలిస్తే జనం. జనం జనం కలిస్తే ప్రభంజనం... అలా ప్రభంజనంలా కమ్మవారంతా కలిసి రండి. చేయి చేయి కలుపుదాం, ఏకతాటిపై నిలిచి మన సత్తా చాటుదాం’’ అని కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌(కేజీఎ్‌ఫ) అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్‌ పిలుపునిచ్చారు. కేజీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆదివారం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా శ్రీపెరంబుదూర్‌ సమీప సేందమంగళంలో ఘనంగా ‘కమ్మ మహానాడు’ నిర్వహించారు. తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల నుంచి కమ్మవారు భారీగా తరలివచ్చారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, శతావధాని మేడసాని మోహన్‌, సీనియర్‌ నటుడు కె.భాగ్యరాజ్‌, తమిళనాడు మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావ్‌, సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌, ఎమ్మెల్యేలు మోహన్‌, సెల్వపెరుందగైతోపాటు వివిధ ప్రాంతాల కమ్మసంఘాల ప్రతినిధులు, కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులు వేదికపై ఆశీనులయ్యారు. మహానాడులో జెట్టి కుసుమకుమార్‌ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తేనే మన జాతికి మంచిదని భావించి కేజీఎ్‌ఫను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దేశంలో 2 కోట్లా 10 లక్షల మంది కమ్మవారున్నారని, అందులో 3వ వంతు కమ్మవారు తమిళనాడులో ఉన్నారని చెప్పారు. ‘కమ్మవారు ప్రపంచంలో అందరినీ సమదృష్టితో చూస్తారు. తమతో పాటు అందరినీ అక్కున చేర్చుకునే గొప్ప సమాజం కమ్మవారిది. కానీ మారిన పరిస్థితుల్లో మన జాతిరాజకీయంగా వెనుకబడుతోంది. కమ్మ వ్యాపారస్తుల నుంచి ధనాన్ని ఆశిస్తున్నారు, కమ్మవారు నడిపే పత్రికల నుంచి పబ్లిసిటీ ఆశిస్తున్నారు. కమ్మవారి ఓట్లు ఆశిస్తున్నారే గానీ రాజకీయంగా కమ్మవారికి ఎవ్వరూ ఏమీ చేయడం లేదు. అందువల్ల మన ఓట్లు మనం సమైక్యం చేసుకుందాం. అందరం సంఘటితం కావాల్సిన అవసరముంది’ అని అన్నారు.


అందరం కలిసి ఉండాలి..

‘దేశజనాభాలో 1.5శాతం కమ్మవారు ఉన్నారు. తమిళనాడు జనాభాలో 8శాతం మంది కమ్మవారున్నారు. కానీ తమిళనాట ఎమ్మెల్యేల్లో 12మంది, ఎంపీలలో ముగ్గురు మాత్రమే కమ్మవారున్నారు. తమిళనాడు అసెంబ్లీలో 30మంది ఎమ్మెల్యేలు, ఉపముఖ్యమంత్రి కమ్మవారు ఉండాలనేదే మా ప్రధాన డిమాండ్‌. ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా కమ్మవారు పోటీచేస్తే, వారికి కేజీఎఫ్‌ అండగా ఉంటుంది. చంద్రబాబు మన నాయకుడే కాదు, జాతీయ నేత. అలాంటి నేతను పెట్టీ కేసుతో జైల్లో వేస్తే, ఆయన కుమారుడు ఢిల్లీ చుట్టూ తిరిగినా సరిగ్గా స్పందించలేదు. అంత పెద్ద నాయకుడికే అలా జరిగితే సాధారణ కమ్మవారి సంగతేంటి? అందుకేఅందరం కలిసి ఉంటే ఎవ్వరూ ఏం చేయలేరు’ అని కుసుమకుమార్‌ అన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు సూచనల మేరకు ట్రస్టు ఏర్పాటు చేసి, పేద కమ్మవారి కోసం నిరంతరం శ్రమిస్తామని హామీ ఇచ్చారు. ఈ ట్రస్టుకు జయా ఇంజనీరింగ్‌ సంస్థల చైర్మన్‌ కనకరాజ్‌ రూ.5 లక్షలు, అరక్కోణంకు చెందిన కొండయ్య రూ.50 వేలు ఇస్తున్నట్లు వేదికపైనే ప్రకటించారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో కమ్మకులానికి తగిన ప్రాధాన్యం లేకుండాపోయిందన్నారు. కమ్మ గ్లోబల్‌ ట్రస్టును ఏర్పాటు చేసి సాయం చేస్తే తమజాతి బాగుపడుతుందని సూచించారు. సీనియర్‌ నటుడు కె.భాగ్యరాజ్‌, శతావధాని మేడసాని మోహన్‌ తదితరులు మాట్లాడారు.

Updated Date - Feb 09 , 2026 | 02:11 AM