నాకు దక్కిన గొప్ప గౌరవమిది
ABN , Publish Date - May 23 , 2026 | 04:26 AM
లండన్‌లోని చారిత్రాత్మక ఇన్నర్ టెంపుల్ కోర్టులో గౌరవ బెంచర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎంపికయ్యారు.
ఇన్నర్ టెంపుల్ బెంచర్‌గా ఎంపికపై జస్టిస్ లావు స్పందన
న్యూఢిల్లీ, మే 22(ఆంధ్రజ్యోతి): లండన్‌లోని చారిత్రాత్మక ఇన్నర్ టెంపుల్ కోర్టులో గౌరవ బెంచర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎంపికయ్యారు. న్యాయవాద వృతిలో అసాఽధారణ కృషికిగాను ఈ గౌరవ సభ్యత్వం లభిస్తుంది. బ్రిటన్, వేల్స్‌లో బారిస్టర్లకు, న్యాయమూర్తులకు శిక్షణ ఇచ్చి, వారిని సభ్యులుగా చేర్చుకునే నాలుగు పాతకాలపు ప్రతిష్ఠాత్మక న్యాయ సంఘాలలో ఇన్నర్ టెంపుల్ ఒకటి. ఈ గౌరవ సభ్యత్వం గతంలో మహాత్మాగాంధీ, మాజీ సీజే జస్టిస్ ఆదర్శ్ సేన్ ఆనంద్, ఢిల్లీ హైకోర్టుకు చెందిన ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ప్రతీక్ జలాన్‌లకు దక్కింది. ఈ ఎంపిక తనకు దక్కిన గొప్ప గౌరవమంటూ జస్టిస్ నాగేశ్వర్‌రావు స్పందించారు. విద్యాపరంగా తన సహకారం అందించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో జన్మించిన లావు నాగేశ్వరరావు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో లా చదివారు. 1982లో గుంటూరు జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించిన ఆయన తర్వాత హై కోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ కొన్ని దశాబ్దాల పాటు ప్రాక్టీసు చేశారు. సుప్రీం కోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన తర్వాత ఆయనను నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. 2022 జూన్‌లో ఆయన పదవీవిరమణ చేశారు.