Share News

స్వతంత్ర ఈసీని ఏ రాజకీయ పార్టీ కోరుకుంది?

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:07 AM

తమ ఎన్నికల భవితవ్యాన్ని పూర్తి స్వతంత్రంగా వ్యవహరించే సంస్థ (భారత ఎన్నికల సంఘం/ఈసీఐ) చేతుల్లో పెట్టడానికి ఏ రాజకీయ పార్టీ ఇష్టపడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా అన్నారు.

స్వతంత్ర ఈసీని ఏ రాజకీయ పార్టీ కోరుకుంది?

  • ఈసీ స్వతంత్రతను కాపాడడంలో ప్రభుత్వాలు విఫలం.. అధికారంలో ఉన్నవారు ఎన్నికల ప్రక్రియను గుప్పిట్లో పెట్టుకుంటారని అంబేడ్కర్‌ ఆనాడే ఆందోళన చెందారు

  • రాజ్యాంగ ఆదర్శాలు నెరవేరడం లేదు.. సంస్థలు బలహీనపడ్డాయి

  • పీఎం కార్యాలయంపై అంబేడ్కర్‌ ఉంచిన నమ్మకం ఆచరణలో కనబడుతోందా?..

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24: తమ ఎన్నికల భవితవ్యాన్ని పూర్తి స్వతంత్రంగా వ్యవహరించే సంస్థ (భారత ఎన్నికల సంఘం/ఈసీఐ) చేతుల్లో పెట్టడానికి ఏ రాజకీయ పార్టీ ఇష్టపడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా అన్నారు. స్వతంత్ర ఎన్నికల సంఘాన్ని ఏ రాజకీయ పార్టీ కోరుకుందని ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) నియామక ప్యానెల్‌ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) తప్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై.. జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం వరకు సుదీర్ఘ వాదనలు విన్నది. ఈ సందర్భంగా జస్టిస్‌ దత్తా ఎన్నో కీలక వ్యాఖ్యలు చేయగా.. అందులో కొన్ని ఇలా ఉన్నాయి. ఈసీఐ పూర్తి స్వతంత్రంగా ఉంటే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగానో లేక ప్రతికూలంగానో కాకుండా.. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ‘‘భారత ప్రజల దురదృష్టం ఏమిటంటే.. రాజ్యాంగం నిర్దేశించిన ఉన్నతమైన ఆదర్శాలు చాలా వరకు నెరవేరకుండా మిగిలిపోయాయి. దీనికి కారణం గతంలో, ప్రస్తుతం అధికారంలో ఉన్న వారిలో ఆ విధమైన సంకల్పం లేకపోవడమే.


ఫలితంగా ఆయా సంస్థలు బలహీనపడుతున్నాయి’’ అని దత్తా వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా 2023 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం సీఈసీ, ఈసీల నియామక ప్యానెల్‌లో ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేతతో పాటు ప్రధాని నామినేట్‌ చేసే ఒక కేంద్ర మంత్రి మూడో సభ్యుడిగా ఉంటారు. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వాదనలను జస్టిస్‌ దత్తా ఎండగట్టారు.


ఆచరణలో కనిపిస్తున్నాయా..?

ప్రధానమంత్రి కార్యాలయంపై రాజ్యాంగం పవిత్రమైన విశ్వాసాన్ని ఉంచిందని తుషార్‌ మెహతా గుర్తు చేస్తూ.. ఎంపిక కమిటీలో ప్రభుత్వం వైపు నుంచి ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉన్నంత మాత్రాన, ప్రఽధాని లేదా మంత్రులు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తారని కోర్టు భావించరాదన్నారు. దీనికి జస్టిస్‌ దత్తా స్పందిస్తూ.. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో ప్రధానమంత్రి స్వయంగా ఒక మంత్రిని సభ్యుడిగా నియమిస్తే.. ఆ మంత్రి అదే ప్రధానికి వ్యతిరేకంగా నిలబడతారని ఎలా ఆశించగలం? అని ప్రశ్నించారు. అంతేకాదు, ప్రధానమంత్రి కార్యాలయంపై అంబేడ్కర్‌ ఉంచిన నమ్మకం, విశ్వాసం, ఆశ అన్నవి స్వాతంత్య్రం వచ్చిన కొన్నేళ్లలోనే నీరుగారిపోయాయన్నారు. రాజ్యాంగ పరిషత్‌ చర్చల సమయంలో.. నేరచరిత్ర ఉన్నవారు మంత్రులుగా కాకుండా ఉండేందుకు, అనర్హత నిబంధనలు పెట్టాలన్న ప్రతిపాదనలను అంబేడ్కర్‌ వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించారు. దీనికి బదులు ప్రధాని, శాసన వ్యవస్థ, ప్రజలు వివేకంతో అలాంటి వారు అధికారంలోకి రాకుండా చూస్తారన్న నమ్మకాన్ని ఉంచినట్టు జస్టిస్‌ దత్తా పేర్కొన్నారు. 1951 అక్టోబర్‌ 28న అంబేడ్కర్‌ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమైతే తిరుగుబాటు, అరాచకం, కమ్యూనిజానికి దారితీస్తాయన్న వ్యాఖ్యలను జస్టిస్‌ దత్తా ఉదహరించారు. ఎన్నికల ప్రక్రియను అధికారంలో ఉన్న వారు గుప్పిట్లో పెట్టుకుంటారని, ధనిక వ్యాపారవేత్తలు పార్టీలకు నిధులిచ్చి, అధికారంలో ఉన్నవారిని శాసిస్తారని అప్పట్లోనే అంబేడ్కర్‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు. అలాగే, అధికారంలో ఉన్నవారు ఎన్నికల ప్రక్రియను గుప్పిట్లో పెట్టుకుంటారని అంబేడ్కర్‌ ఆందోళన చెందినట్లు నాటి ప్రసంగం తెలియజేస్తోందన్నారు. రాజ్యాంగం అన్నది కాగితాలకే పరిమితం కాకూడదని.. అధికారంలో ఉన్నవారు ఆచరణలో చూపాలన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించుకోకపోతే ప్రజాస్వామ్యం అలంకారప్రాయంగా మారి, ఆచరణలో నియంతృత్వం వైపు మళ్లే ప్రమాదం ఉంటుందన్న అంబేడ్కర్‌ హెచ్చరికలను ఆయన గుర్తు చేశారు.

Updated Date - Sep 25 , 2026 | 06:09 AM