Share News

30 రోజులు జైల్లో ఉంటే అంతే..!

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:12 AM

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎవరైనా 30 రోజుల పాటు జైల్లో ఉంటే పదవిని కోల్పోవడం తప్పనిసరి చేస్తూ రూపొందించిన రాజ్యాంగ సవరణ....

30 రోజులు జైల్లో ఉంటే అంతే..!

  • ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పదవిని కోల్పోయినట్లే

  • జేపీసీ పరిశీలనలో బిల్లు

  • త్వరలో తెలంగాణ, కర్ణాటకలో జేపీసీ పర్యటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎవరైనా 30 రోజుల పాటు జైల్లో ఉంటే పదవిని కోల్పోవడం తప్పనిసరి చేస్తూ రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) త్వరలో తెలంగాణ, కర్ణాటకల్లో పర్యటించనుంది. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడే నేరాల్లో నిందితులైన, వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉన్న ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులను తొలగించేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు. మంత్రులను తొలగించే విషయంలో ప్రధాని సలహాపై రాష్ట్రపతి; ముఖ్యమంత్రి సలహాపై గవర్నర్‌ నిర్ణయం తీసుకుంటారు. ప్రధాని, సీఎం జైలుపాలైన తర్వాత 30 రోజుల్లోపు రాజీనామా చేయకపోతే 31వ రోజు పదవిని కోల్పోతారు. సాధ్యమైనంత త్వరలోనే ఎన్డీయేకు చెందిన పార్టీల ప్రభుత్వాలను సంప్రదించాలనుకుంటున్నట్లు జేపీసీ చై ర్మన్‌, బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి తెలిపారు. గత ఏడాది ఆగస్టులో ఈ బిల్లును హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి నివేదించారు. జేపీసీలో బీజేపీ ఎంపీలు లక్ష్మణ్‌, డీకే అరుణ, జనసేన ఎంపీ బాలశౌరి, వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఎన్డీయే ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ బిల్లుకు అంగీకారం తెలపగా, ప్రతిపక్షాలు జేపీసీ సమావేశాన్ని బహిష్కరించాయి. ఈ బిల్లులో మౌలిక లోపాలున్నాయని ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే, మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వాదించారు.

Updated Date - Feb 27 , 2026 | 04:12 AM