ఇక జియో శాటిలైట్ ఇంటర్నెట్!
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:54 AM
దేశ టెలికం రంగంలో సంచనాలతో దాదాపు గుత్తాధిపత్యం సాధించిన రిలయన్స్ జియో ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్‌పైనా కన్నేసింది.
నేరుగా నింగి నుంచే టెలికం సర్వీసులు.. సుమారు లక్షన్నర కోట్ల వ్యయం
న్యూఢిల్లీ, జూన్ 18: దేశ టెలికం రంగంలో సంచనాలతో దాదాపు గుత్తాధిపత్యం సాధించిన రిలయన్స్ జియో ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్‌పైనా కన్నేసింది. సుమారు 1,650 ఉపగ్రహాలతో నేరుగా నింగి నుంచే ఇంటర్నెట్, ఇతర టెలికం సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సుమారు రూ. లక్షన్నర కోట్లు (15బిలియన్ డాలర్లు) వ్యయం చేయనుంది. దీనికి అనుమతులపై కేంద్రప్రభుత్వం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. రిలయన్స్ సంస్థ, కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక దీనిపై కథనం ప్రచురించింది. జియో శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే.. భారత డిజిటల్ సార్వభౌమత్వం పెరుగుతుందని, విదేశీ వ్యవస్థలపై ఆధారపడటం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో ఉన్న పెద్ద సంస్థలకు జియో గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
లియో కక్ష్యలో ఉపగ్రహాలతో..
భూమి ఉపరితలం నుంచి సుమారు 400 కిలోమీటర్ల నుంచి 650 కిలోమీటర్ల ఎత్తు (లోఎర్త్ ఆర్బిట్- లియో)లోకి ఉపగ్రహాలను పంపి.. వాటి సాయంతో నేరుగా ఇంటర్నెట్‌ను అందిస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాలనుగానీ, ఫోన్లను గానీ వినియోగించాల్సి ఉంటుంది. శాటిలైట్ ఇంటర్నెట్‌తో నగరాలు, గ్రామీణ ప్రాంతాలనే కాదు కొం డలు, గుట్టలు, పర్వతాలు, అడవులు, మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్, టెలికం సర్వీసులు అందుతాయి. ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ ఈ రంగంలో అగ్రగామిగా ఉంది. స్టార్‌లింక్ సుమారు 10వేల ఉపగ్రహాలతో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోంది. తర్వాతి స్థానంలో ఉన్న అమెజాన్ లియో ఇప్పటికే వెయ్యికిపైగా ఉపగ్రహాలతో సేవలందిస్తోంది. ఇక మనదేశానికి చెందిన భారతీ గ్రూప్(ఎయిర్‌టెల్ మాతృసంస్థ) వాటాలు న్న యూరోప్ సంస్థ ‘యూటెల్‌సాట్ వన్‌వెబ్’ జాయింట్ వెంచర్ కూడా ఇప్పటికే సుమారు 600 ఉపగ్రహాలను ప్రయోగించి రేసులో ఉంది. అయితే జియో వీటన్నింటికీ భిన్నంగా శాటిలైట్ ఇంటర్నెట్‌నూ అనుసంధానించి.. సమగ్ర టెలికం-ఇంటర్నెట్ వ్యవస్థగా నిలవనుంది.
ఇబ్బందులూ ఉన్నాయి
ప్రస్తుతం జియో శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టు ‘భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, అనుమతుల కేంద్రం (ఇన్ స్పేస్)’ పరిశీలనలో ఉంది. కేంద్రం సానుకూలంగా ఉండటంతో ఇక్కడ అనుమతి రావడం లాంఛనమే. అయితే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి వచ్చే రెండు, మూడేళ్లలో సుమారు రూ.లక్షన్నర కోట్ల మేర వ్యయం అవుతుంది. పైగా శాటిలైట్ కక్ష్యలు, సిగ్నల్ స్పెక్ట్రమ్‌ను ‘అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ)’ నుంచి పొందాల్సి ఉంటుంది.