Share News

మ్యాథ్స్‌లో కాలిక్యులేషన్స్‌ ఎక్కువే!

ABN , Publish Date - Apr 03 , 2026 | 03:55 AM

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీల్లో చేరేందుకు, ఐఐటీ అడ్వాన్స్‌డ్‌కు అర్హులైన విద్యార్థుల ఎంపికకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ...

మ్యాథ్స్‌లో కాలిక్యులేషన్స్‌ ఎక్కువే!

  • భావనల్లో స్పష్టత ఉంటే ఫిజిక్స్‌ సులువు

  • ఎప్పటిలాగే కెమిస్ర్టీ.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ఆధారితం

  • మోడరేట్‌గా జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ తొలిరోజు పరీక్షలు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీల్లో చేరేందుకు, ఐఐటీ అడ్వాన్స్‌డ్‌కు అర్హులైన విద్యార్థుల ఎంపికకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తున్న జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) రెండో సెషన్‌ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రెండు షిఫ్టుల్లోనూ ప్రశ్నపత్రం స్థాయి మోడరేట్‌ (మధ్యస్థం)గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు ఫిజిక్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి.. కానీ ఇప్పుడు మ్యాథ్స్‌ విషయంలో వినిపిస్తున్నాయి. జనవరిలో జరిగిన పరీక్షలతో పోల్చితే మొదటి షిఫ్ట్‌ ప్రశ్నపత్రం కాస్త ఎక్కువ కష్టంగా ఉందని పలువురు విద్యార్థులు చెబుతున్నట్టుగా హైదరాబాద్‌లోని ఎక్స్‌లెన్సియాకు చెందిన డాక్టర్‌ పవన్‌ కుమార్‌ కాసు తెలిపారు. మొదటి షిఫ్ట్‌లో మ్యాథ్స్‌ మోడరేట్‌ నుంచి కష్టంగా ఉందని, క్యాలిక్యులేషన్స్‌ చాలా ఎక్కువగా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కోఆర్డినేట్‌ జామెట్రీ, కాలిక్యులస్‌, మేట్రిసెస్‌ అండ్‌ డిటెర్మెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఫిజిక్స్‌ సులువు నుంచి మోడరేట్‌గా ఉంది. భావనల్లో స్పష్టత ఉన్న విద్యార్థులు ఈ సబ్జెక్టును సులువుగా అటెంప్ట్‌ చేసినట్టు సమాచారం. ఫార్ములా ఆధారితం, అలాగే ఎన్‌సీఈఆర్‌టీ స్థాయిలో ప్రశ్నలు ఉన్నాయి. కెమిస్ర్టీ కూడా ఫిజిక్స్‌ మాదిరిగానే ఉంది. ఎప్పటిలాగే సమతుల్యత పాటించారు. ప్రత్యేకించి ఇనార్గానిక్‌ కెమిస్ర్టీలో ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ఆధారంగానే అడిగారు. రెండో షిఫ్ట్‌ విషయానికివస్తే.. జనవరి సెషన్‌తో పోల్చితే మ్యాథ్స్‌ సులువుగా ఉంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ మోడరేట్‌గా ఉందని చెప్పవచ్చు. మొద టి షిఫ్ట్‌ పేపర్‌లో సమతూకం ఉందని ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసె్‌సకు చెందిన అజయ్‌ శర్మ అభిప్రాయడ్డారు. జనవరి సెషన్‌తో పోల్చితే ఈ పేపర్‌ క్లిష్టత నుంచి కాన్సెప్ట్‌ క్లారిటీ దిశగా మళ్లిందన్నారు. కాగా జేఈఈ జనవరి సెషన్‌లో తొలిసారి పరీక్షలు రాసిన విద్యార్థులకు తాజా పరీక్షల ప్రశ్నపత్రాలు అంతకష్టంగా ఏమీ అనిపించలేదని శ్రీచైతన్య విద్యాసంస్థల డీన్‌ శంకరరావు అన్నారు. మొదటి సెషన్‌లో ఇచ్చిన 10కి పైగా ప్రశ్నపత్రాలను ఆన్సర్‌ చేసి, అదేస్థాయిలో ప్రిపేరు వల్ల ఈ సెషన్‌లో ప్రశ్నలను సులువుగానే ఆన్సర్‌ చేయగలిగారని పేర్కొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 03:55 AM