కఠినంగానే జేఈఈ అడ్వాన్స్‌డ్
ABN , Publish Date - May 18 , 2026 | 02:47 AM
దేశంలోని ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష కాస్త కఠినంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.
(ఆంధ్రజ్యోతి ఎడ్యుకేషన్ డెస్క్)
దేశంలోని ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష కాస్త కఠినంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం, సాయంత్రం రెండు పేపర్లుగా ఈ పరీక్ష జరిగింది. ఒక్కో పేపర్ కాలవ్యవధి 3గంటలు కాగా.. రెండు పేపర్లలోనూ గణితం, భౌతికశాస్త్రం, రసాయశాస్త్రం నుంచి ప్రశ్నలు అడిగారు. మొదటి పేపర్ మోడరేట్ నుంచి కఠినంగా ఉంది. ఈ పేపర్‌లో గణితం విభాగంలో ప్రశ్నలు చాలా కష్టంగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. ప్రశ్నల నిడివి కూడా ఎక్కువగా ఉంది. ఫిజిక్స్‌లో ప్రశ్నలు కాన్సెప్టులు లోతుగా తెలిస్తేనే సమాధానం రాయగలిగేలా అడిగారు. కెమిస్ట్రీలో చాలా ప్రశ్నలు గందరగోళపరిచేలా ఉన్నాయి. రెండో పేపర్‌లోనూ గణితం ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. పేపర్ మొత్తం ఎక్కువగా కాన్సెప్టులతో కూడిన ప్రశ్నలే ఉండటంతో సమాధానాలు గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చిందని విద్యార్థులు తెలిపారు.
భిన్నరకాలుగా ప్రశ్నలు
రెండు పేపర్లలో ప్రతి సబ్జెక్టులోనూ సింగిల్ చాయిస్, మల్టిపుల్ చాయిస్, మ్యాట్రిక్స్ మ్యాచ్, ఇంటీజర్ టైప్ ప్రశ్నలు అడిగారు. ఒక్క ఇంటీజర్ టైప్ ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కులు లేవు. మిగిలిన మూడింటిలో ఏ ప్రశ్నకు సమాధానం తప్పుగా గుర్తించినా ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి పేపర్‌లోని ఫిజిక్స్ విభాగంలో ప్రధాన చాప్టర్ల నుంచే ప్రశ్నలు అడిగారని ఆకాశ్ ఇన్‌స్ట్టిట్యూట్ డైరెక్టర్ అజయ్ శర్మ తెలిపారు. మోడ్రన్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రో స్టాటిస్టిక్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. పలు కాన్సెప్టులను కలగలిపి ప్రశ్నలు అడిగారని శిక్షా నేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సౌరభ్ కుమార్ తెలిపారు. కెమిస్ట్రీ ప్రశ్నలు మోడరేట్‌గా ఉన్నాయని చెబుతున్నారు. ఫిజికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడిగారు. మ్యాథ్స్‌లో డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టర్ట్, 3డి జామెట్రీ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. రెండో పేపర్‌లో మ్యాథ్స్ విభాగం చాలా కష్టంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఫిజిక్స్‌లో కాలిక్యులేషన్స్ ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉంది. మెకానిక్స్, ఎలక్ట్రో డైనమిక్స్, ఆప్టిక్స్, థెర్మోడైనమిక్స్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వచ్చాయి.