Jasmine Prices Surge: మల్లెలు కిలో రూ.3,000
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:04 AM
ఓ వైపు మార్గళి పూజలు, మరో వైపు ఆంగ్ల సంవత్సరాదివేడుకల కారణంగా తమిళనాడులో మల్లెలు సహా అన్నిరకాల పూల ధరలకు రెక్కలు వచ్చాయి.
తమిళనాడులో పూల ధరలకు రెక్కలు
న్యూ ఇయర్, వైకుంఠ ఏకాదశి ఎఫెక్ట్
చెన్నై, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు మార్గళి పూజలు, మరో వైపు ఆంగ్ల సంవత్సరాదివేడుకల కారణంగా తమిళనాడులో మల్లెలు సహా అన్నిరకాల పూల ధరలకు రెక్కలు వచ్చాయి. మదురై మార్కెట్లో గురువారం మల్లెలు కిలో రూ.2,500లు, తేని జిల్లా ఆండిపట్టి మార్కెట్లో రూ.3,000 ధర పలికాయి. అలాగే, కనకాంబరం కిలో రూ.2,500, ముల్లై పూలు కిలోరూ.1,200, సింధూరపువ్వులు రూ.120, పన్నీటి గులాబీల ధరలు రూ.200 వరకు పెరిగాయి. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, మంచు కురవడం ప్రారంభమైంది. ఈ కారణంగా పూల దిగుబడులు కూడా బాగా తగ్గిపోయాయి. అదే సమయంలో, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఈ కారణంగా అన్ని రకాల పూల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సంక్రాంతి రానున్న కారణంగా ఈ పూల ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు పేర్కొంటున్నారు.