ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:24 AM
నీట్ పేపర్ లీకేజీకి, విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్ జనతా పార్టీ....
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన..న్యాయం జరిగే వరకు జంతర్ మంతర్ వీడబోమని ప్రకటన
న్యూఢిల్లీ, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): నీట్ పేపర్ లీకేజీకి, విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరోసారి డిమాండ్ చేసింది. శనివారం జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టింది. ‘థాలీ బజావో’ పేరిట చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, భారీ సంఖ్యలో విద్యార్థులు, మద్దతుదారులు తరలివచ్చారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడాలని విద్యార్థులు నినాదాలు చేశారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపు మేరకు మద్దతుదారులు ప్లేట్లు, స్పూన్లు తీసుకొచ్చి వాటిని మోగిస్తూ తమ నిరసన తెలిపారు. అయితే ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు తాము జంతర్ మంతర్‌ను వీడబోమని వారు ప్రకటించడంతో వందలాదిగా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. విద్యార్థులకు తాగునీరు, ఆహార పదార్థాల సరఫరాను అడ్డుకున్నారు. దీంతో సీజేపీ నిరసన ఉద్రిక్తంగా మారింది. నిరసన కొనసాగించేందుకు సాయంత్రం 6 గంటల వరకు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలని ఢిల్లీ వాసులకు అభిజీత్ దీప్కే పిలుపునివ్వడంతో ఆ ప్రాంతానికి చేరుకునే రహదారులను పోలీసులు పూర్తిగా మూసివేశారు. అక్కడి లైట్లను ఆపివేశారు. ఇచ్చిన గడువు ముగిసినందున నిరసన విరమించాలని పోలీసులు పదే పదే కోరినప్పటికీ.. రాత్రి అవుతున్నా విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లలేదు.
విద్యావ్యవస్థలో సమస్యను తొలగించాలి..
నిరసన సందర్భంగా అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు. ‘‘కరోనా వైరస్ సమయంలో ప్లేట్లు వాయించడం ద్వారా వచ్చే వైబ్రేషన్ వల్ల ఆ వైరస్ అంతమవుతుందని చెప్పారు కదా! అదేవిధంగా ఇప్పుడు మన విద్యావ్యవస్థను పట్టి పీడిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ అనే వైర్‌సను తొలగించడానికి మనం మళ్లీ ప్లేట్లు వాయిద్దాం. ఇది వ్యంగ్యమైనప్పటికీ మన విద్యావ్యవస్థలో ఉన్న సమస్యను తొలగించాల్సిందే’’ అని అభిజీత్ అన్నారు. న్యాయం జరిగే వరకు తాము జంతర్‌మంతర్‌ను వదలబోమన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తీరును అభిజీత్ తీవ్రంగా తప్పుబట్టారు. తనపై ఈ చీకట్లో దాడి జరిగితే లైట్లను ఆపివేసిన వారిదే బాధ్యత అని అన్నారు. నిరసన ప్రాంతంలో విద్యార్థులకు తాగునీరు కూడా అందకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. భగత్‌సింగ్ నిరసన చేస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్లు కూడా నీళ్లు ఇచ్చారని తెలిపారు.