Share News

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు పోలీసు అధికారుల హత్య

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:32 AM

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలపై వరుస ఉగ్రదాడులు కలకలం రేపుతున్నాయి. కుల్గామ్‌ జిల్లాలో సీఆర్పీఎఫ్‌ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేసిన మరుసటి రోజే మరో..

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు పోలీసు అధికారుల హత్య

జమ్మూ/న్యూఢిల్లీ, నవంబరు 12: జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలపై వరుస ఉగ్రదాడులు కలకలం రేపుతున్నాయి. కుల్గామ్‌ జిల్లాలో సీఆర్పీఎఫ్‌ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేసిన మరుసటి రోజే మరో ఘటన వెలుగుచూసింది. కిశ్త్‌వాడ్‌ జిల్లాలో స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్లు బాబీ చాంద్‌ (57), రశ్‌పాల్‌ కుమార్‌ (45) బుధవారం మధ్యాహ్నం తమ శిబిరం నుంచి ధార్నా- మార్వా ప్రాంతంలోని ఆర్మీ పోస్టుకు పెట్రోలింగ్‌ నిమిత్తం వెళ్తుండగా.. కియార్‌ గ్రామం వద్ద అదృశ్యమయ్యారు. తర్వాత వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ కావడంతో అప్రమత్తమైన అధికారులు.. డ్రోన్లు, జాగిలాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం బుల్లెట్లతో ఛిద్రమైన వారి మృతదేహాలను దచన్‌ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గుర్తించాయి. ఘటనా స్థలంలో పోలీసు ఆఫీసర్ల సర్వీసు తుపాకులు కనిపించలేదని, పాకిస్థాన్‌ తయారీ బుల్లెట్ల ఖాళీ గుండ్లు లభించాయని అధికారులు వెల్లడించారు. దీంతో ఉగ్రకోణం ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Updated Date - Nov 13 , 2026 | 02:34 AM