Share News

జమ్ముకశ్మీర్‌లో వెల్లువెత్తిన నిరసన

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:11 AM

ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీనగర్‌ సహా కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు ఆదివారం వీధుల్లోకి వచ్చి అమెరికా....

జమ్ముకశ్మీర్‌లో వెల్లువెత్తిన నిరసన

  • ఖమేనీ హత్యను ఖండిస్తూ రోడ్డెక్కిన నిరసనకారులు

శ్రీనగర్‌, మార్చి 1: ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీనగర్‌ సహా కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు ఆదివారం వీధుల్లోకి వచ్చి అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో తమ నాయకుడు ఖమీనే మృతిచెందారని ఇరాన్‌ అధికారిక మీడియా ఆదివారం తెల్లవారుజామున ధ్రువీకరించింది. దీంతో షియాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయని జమ్ముకశ్మీర్‌ అధికారులు వెల్లడించారు. కశ్మీర్‌ లోయలో సుమారు 15లక్షల మంది షియాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో లోయలోని లాల్‌ చౌక్‌, సైదా కదల్‌, బుద్గాం, బండిపోరా, అనంతనాగ్‌, పుల్వామా ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. కశ్మీర్‌కు చెందిన కీలక నాయకుడు మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌.. ఖేమేనీ హత్యపట్ల తీవ్ర విచారం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఖమేనీ మరణం ముస్లిం ప్రపంచాన్ని కుదిపేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌ ఆయనను దారుణంగా హత్య చేశాయి. ఈ క్రూరత్వాన్ని, ఇరాన్‌పై కొనసాగుతున్న దురాక్రమణను, అలాగే మినాబ్‌లో అమాయక బాలికలపై ఊచకోతను జమ్ముకశ్మీర్‌ ప్రజలు సమష్టిగా ఖండిస్తున్నారు’’ అని మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. కశ్మీర్‌ ప్రజల తరఫున ఇరాన్‌ ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్టు వెల్లడించారు. ‘‘ఈ విషాద సమయంలో మేం ఇరాన్‌ ప్రజలకు అండగా నిలుస్తున్నాం. ఈ మారణకాండలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవాలని, దీనికి కారణమైన వారికి తక్షణమే శిక్షపడేలా చూడాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం’’ అని ఫరూక్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇరాన్‌లో కొనసాగుతున్న దురాక్రమణకు వ్యతిరేకంగా తమ నిరసన, సంఘీభావాన్ని తెలిపేందుకు ముస్లింలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమేనీ హత్యకు నిరసనగా ముతాహిదా మజ్లి్‌స-ఎ-ఉలమా (ఎంఎంయూ) సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిందని తెలిపారు.

Updated Date - Mar 02 , 2026 | 01:11 AM