Share News

విదేశీ గూఢచార సంస్థలకు సహకారం!

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:30 AM

చైనా గూఢచారుల కోసం దేశ రక్షణకు సంబంధించిన సున్నిత అంశాలపై వ్యాసాలను రాసిన ఆరోపణలపై ఒక భారత సైనికాధికారి భార్యపై జమ్ములో ఆదివారం కేసు నమోదైంది.

విదేశీ గూఢచార సంస్థలకు సహకారం!

  • సైనికాధికారి భార్యపై కేసు నమోదు

  • ఆమె తెలంగాణకు చెందిన ఫ్రీలాన్స్‌ రీసెర్చర్‌

జమ్ము, అక్టోబరు 18: చైనా గూఢచారుల కోసం దేశ రక్షణకు సంబంధించిన సున్నిత అంశాలపై వ్యాసాలను రాసిన ఆరోపణలపై ఒక భారత సైనికాధికారి భార్యపై జమ్ములో ఆదివారం కేసు నమోదైంది. తెలంగాణకు చెందిన ఉన్నత విద్యావంతురాలైన ఆమె ఫ్రీలాన్స్‌ రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. దేశ భద్రత, రక్షణ, జియో పొలిటికల్‌ అంశాలపై వ్యాసాలు రాయాల్సిందిగా ఆమెను కొందరు విదేశీయులు కోరారు. దీనిపై కూపీ అందడంతో రంగంలో దిగిన కేంద్ర ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ, స్థానిక పోలీసుల బృందం.. ఆమెను సైనిక కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆమె మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. కాగా 2023 అక్టోబరులో ఆమె ఒక ఆర్మీ మేజర్‌ను వివాహం చేసుకున్నారు. అదే ఏడాది ఆమె యునైటెడ్‌ నేషన్స్‌లో ఐటీ ఇంటర్న్‌షిప్‌ చేశారు. ఆ సమయంలో పలువురు విదేశీయులు పరిచయమయ్యారు. వారిలో ఒక చైనీయుడు కూడా ఉండగా.. అతడితో ఆమె వాట్సా్‌పలో కాంటాక్ట్‌లో ఉన్నారు. అలాగే 2024లో చైనా గూఢచారి సంస్థల కోసం పనిచేస్తున్న మలేషియన్‌ దేశస్థుడు సోషల్‌ మీడియా ద్వారా పరిచయమవగా అతడితో కాంటాక్ట్‌లో ఉన్నారు. ఆమె మొబైల్‌ ఫోన్‌లో రక్షణ అంశాలపై భారత్‌-ఇటలీ సమావేశం, ఆర్మీ చీఫ్‌ అమెరికా పర్యటన, భారత్‌ - రష్యా రక్షణ ఒప్పందం, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కలాయ్‌-2 జల విద్యుత్‌ ప్రాజెక్టు, కమల ప్రాజెక్టులు, కోల్డ్‌ స్టార్ట్‌ డాక్ట్రిన్‌, భారత్‌ - సెషెల్స్‌ సంబంధాలు, అసోంలోని ప్రాజెక్టులు, భారత్‌ - చైనా సంబంధాలవంటి అంశాలపై రాసిన వ్యాసాలను గుర్తించారు. ఈ సమాచారమంతా చాట్‌జీపీటీ, క్లాడ్‌ ద్వారా సేకరించిందేనని ఆమె పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Oct 19 , 2026 | 06:31 AM