Share News

ఇరాన్‌ యుద్ధం వేళ మోదీ స్థానంలో..మరొకరుంటే దేశం దివాలా తీసేది

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:38 AM

ఇరాన్‌ యుద్ధ సంక్షోభం వల్లభారత ఆర్థిక వ్యవస్థకు వాటిల్లాల్సిన నష్టాన్ని సాధ్యమైనంత వరకు ప్రధాని నరేంద్ర మోదీ తగ్గించారని, ఆయన స్థానంలో ఇతరులు ఉండి ఉంటే దేశం..

ఇరాన్‌ యుద్ధం వేళ మోదీ స్థానంలో..మరొకరుంటే దేశం దివాలా తీసేది

  • గల్ఫ్‌ పర్యటనలో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

ఇరాన్‌ యుద్ధ సంక్షోభం వల్లభారత ఆర్థిక వ్యవస్థకు వాటిల్లాల్సిన నష్టాన్ని సాధ్యమైనంత వరకు ప్రధాని నరేంద్ర మోదీ తగ్గించారని, ఆయన స్థానంలో ఇతరులు ఉండి ఉంటే దేశం దివాలా పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేదని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వ్యాఖ్యానించారు. గల్ఫ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అబుదాబి రాజ కుటుంబీకులను కలుసుకొనేందుకువచ్చిన ఆయన శనివారం యూఏఈలోని వివిధ ఎమిరేట్ల ప్రవాసీ భారతీయ ప్రముఖులతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కీలకమైన గల్ఫ్‌ ప్రాంతాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక మోదీ వ్యక్తిగత చొరవ కారణంగా గల్ఫ్‌ దేశాలతో సంబంధాలు బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో గల్ఫ్‌ పాలకులు భారతీయ అవసరాల గురించి వాకబు చేసే స్థాయికి అవి చేరుకొన్నాయని తెలిపారు. ఇరాన్‌ యుద్ధ సంక్షోభం కారణంగా భారతీయ విమాన రవాణావ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం పడిందని, దాన్నుంచి కోలుకోవడానికి మరికొంత వ్యవధి పడుతుందని జైశంకర్‌ చెప్పారు. పరిస్థితులు పూర్తిగా మెరుగుపడేంత వరకు విమానాల టికెట్ల ధరల్లో హెచ్చుతగ్గులుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విమానాల రాకపోకల్లో అంతరాయాన్ని ఆయన దృష్టికి తేగా.. యుద్ధం పరిస్థితుల్లో భారతీయుల సంక్షేమం, భద్రతకు మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వీలైనంత వరకు విమానాలను పునరుద్ధరించడానికి గల్ఫ్‌ దేశాలతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. భారత వికాసంలో సప్లయి చైన్‌ విధానం అత్యంత కీలకమైందని, ప్రస్తుత యుద్ధం కారణంగా అది దెబ్బతిందని జైశంకర్‌ పేర్కొన్నారు. భారత దౌత్య నీతితో దాన్ని తాము పూర్తిగా నిర్వీర్యంకాకుండా చూస్తున్నామన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 03:39 AM