ఏ ఒక్క సందేహానికీ మోదీ జవాబు చెప్పలేదు
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:30 AM
పునర్విభజన ప్రక్రియపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, కానీ మోదీ ఒక్క సందేహానికీ జవాబు చెప్పలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు.
పునర్విభజన ప్రక్రియపై అనుమానాలు: జైరాం రమేశ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పునర్విభజన ప్రక్రియపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, కానీ మోదీ ఒక్క సందేహానికీ జవాబు చెప్పలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని వదిలేసి, తన అలవాటు ప్రకారం మిగిలిన అన్ని అంశాలపై మోదీ మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో జైరాం రమేష్ పలు ప్రశ్నలు సంధించారు. బిల్లుల ఆమోదానికి అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రధాని కోరుతున్నారని, అయితే ఆయన ప్రభుత్వం మాత్రం ఏనాడూ ప్రతిపక్షాల విశ్వాసాన్ని పొందేలా వ్యవహరించలేదన్నారు. పలువురు ముఖ్యమంత్రులు, ఎంపీలు లేవనెత్తిన అత్యంత విలువైన అంశాలను సాంకేతిక సాకులుగా కొట్టిపారేయడం ప్రధాని అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై నోరు మెదపడం లేదన్నారు.