Share News

ISRO Set for PSLV-C62 Launch: రేపే నింగిలోకి పీఎస్‌‌ఎల్వీ-సీ62

ABN , Publish Date - Jan 11 , 2026 | 03:15 AM

ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌ నుంచి సోమవారం.....

ISRO Set for PSLV-C62 Launch: రేపే నింగిలోకి పీఎస్‌‌ఎల్వీ-సీ62

సూళ్లూరుపేట/తిరుమల, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌ నుంచి సోమవారం ఉదయం 10.17 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ62 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎ్‌స-ఎన్‌1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనుంది. కొత్త ఏడాదిలో ఇస్రోకు ఇదే తొలి ప్రయోగం. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను 22 గంటల ముందు అంటే.. ఆదివారం మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రారంభించనున్నారు. కౌంట్‌డౌన్‌ ముగియగానే సోమవారం ఉదయం 10.17 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ62 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగరనుంది. కౌంట్‌డౌన్‌ ముందు ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌కు తుది దశ పరీక్షలు నిర్వహించి, ప్రీ కౌంట్‌డౌన్‌ నిర్వహించారు. పీఎ్‌సఎల్వీ-సీ 62 ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ శనివారం శాస్త్రవేత్తలతో కలిసి తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వర స్వామిని, సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి పాదాల చెంత ఉపగ్రహం నమూనాను ఉంచి పూజలు చేశారు. ఇస్రో చైర్మన్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఈవోఎ్‌స-ఎన్‌ 1 అత్యంత అధునాతనమైదని, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిశోధన నిమిత్తం దీనిని కక్ష్యలోకి పంపుతున్నామన్నారు. దీంతో పాటు పంపే మిగతా 15 ఉపగ్రహాలనూ ధ్రువ కక్ష్యలోకి రాకెట్‌ ప్రవేశపెడుతుందన్నారు. వీటిలో 8 విదేశీ ఉపగ్రహాలున్నాయని పేర్కొన్నారు. వీటితో భారత్‌ నుంచి ఇప్పటి వరకు ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 442కి చేరుతుందని తెలిపారు.

Updated Date - Jan 11 , 2026 | 03:15 AM