Share News

సవాళ్లు ఎదుర్కొని సొంత నావిక్‌!

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:42 AM

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి. స్వదేశీ నావిక్‌ వ్యవస్థ కోసం జీఎ్‌సఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్‌ ద్వారా నింగిలోకి పంపిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది.

సవాళ్లు ఎదుర్కొని సొంత నావిక్‌!

  • ఎన్‌వీఎస్ -02 విఫలమైనా పట్టువదలని ఇస్రో

(సూళ్లూరుపేట-ఆంధ్రజ్యోతి)

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి. స్వదేశీ నావిక్‌ వ్యవస్థ కోసం జీఎ్‌సఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్‌ ద్వారా నింగిలోకి పంపిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయాన్ని అందుకునే క్రమంలో ఇస్రో అనేక సవాళ్లను ఎదుర్కొంది. దీనికంటే ముందు 2025 జనవరిలో చేపట్టిన ఎన్‌వీఎస్-02 ఉపగ్రహ ప్రయోగం విఫలమవడంతో ఇస్రో విమర్శలు ఎదుర్కొంది. అయితే.. అప్పట్లో తలెత్తిన కనెక్టర్‌ వైఫలాన్ని అధికమించడానికి ఎన్‌వీఎ్‌స-03 ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఇస్రోకు చెందిన స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో తయారు చేశారు. ఇందులో స్వదేశీ రుబీడియం అటామిక్‌ క్లాక్‌ ఉంది. అలాగే ఎల్‌1, ఎల్‌5, ఎస్‌ బ్యాండ్‌లతో సంకేతాలను ప్రసారం చేయనుంది. భారత ప్రాంతీయ నావిగేషన్‌ శాటిలైట్‌ వ్యవస్థ సేవల కొనసాగింపు కోసం ఎన్వీఎస్‌-03 ఉపగ్రహం పనిచేస్తుంది. భారత భౌగోళిక పరిధితోపాటు, సరిహద్దుల ఆవల 1,500 కి.మీ. పరిధి వరకూ ఈ నావిగేషన్‌ సిస్టమ్‌ కవర్‌ చేస్తుంది. అమెరికాకు చెందిన జీపీఎస్‌, రష్యాకు సంబంధించిన గ్లోనాస్‌, యూర్‌పకు చెందిన గెలీలియో, చైనాలోని బీడౌ నావిగేషన్‌ శాటిలైట్‌ వ్యవస్థలు ప్రపంచాన్ని కవర్‌ చేస్తున్నాయి. అలాగే నావిక్‌ అనేది భారత ప్రాంతంపై పనిచేసే స్వత్రంత నావిగేషన్‌ వ్యవస్థ.


దీనిపై పూర్తి పర్యవేక్షణ భారత్‌ పరిధిలో ఉంటుంది. స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ కోసం భారత ప్రభుత్వం 2006లో ఆమోదం తెలిపింది. 2013లో నావిక్‌ వ్యవస్థ కోసం రూ.2,250 కోట్లు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్రో 11 నావిగేషన్‌ ఉపగ్రహాలను ప్రయోగించింది. తాజాగా శ్రీహరికోట నుంచి శుక్రవారం కక్ష్యలోకి పంపిన ఎన్‌వీఎస్-03తో ఆ సంఖ్య 12కు చేరింది. వీటిలో కొన్ని విఫలం అయ్యాయి. వాస్తవానికి మొదట్లో నావిక్‌ను 7ఉపగ్రహాలతో కలిసి పనిచేసేలా రూపొందించారు. కానీ, ప్రస్తుతం ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1బి, ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్1ఐ, ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాలు మాత్రమే నావిక్‌ సిగ్నల్స్‌ అందిస్తున్నాయి. ప్రాథమిక పొజిషన్‌ సేవలను అందించడానికి కక్ష్యలో కనీసం నాలుగు క్రియాశీల ఉపగ్రహాలు అవసరం.

Updated Date - Oct 31 , 2026 | 02:44 AM