Share News

రోదసిలో మన దిక్సూచి

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:29 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. గగనతలంలో మన దిక్సూచి సేవల..

రోదసిలో మన దిక్సూచి

  • ఎన్‌వీఎస్ -3 ఉపగ్రహం నింగిలోకి

  • జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 ప్రయోగం దిగ్విజయం

  • 20 నిమిషాల్లోనే కక్ష్యలోకి

సూళ్లూరుపేట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. గగనతలంలో మన దిక్సూచి సేవల కోసం ఉద్దేశించిన రెండోతరం నావిగేషన్‌ ఉపగ్రహ సిరీస్‌లో మూడోదైన ఎన్‌వీఎస్ -03 (నావిక్‌-3) ఉపగ్రహం దిగ్విజయంగా కక్ష్యలోకి చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం రాత్రి 11:51 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరిన జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ ఎన్‌వీఎ్‌స-03 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. రాకెట్‌ తన మూడు దశలను సునాయాసంగా పూర్తి చేసుకుని 2,250 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 18 నిమిషాల 45 సెకన్లలోనేకక్ష్యలో విడిచిపెట్టింది. అంతకుముందు గురువారం రాత్రి 11:51 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ 24 గంటలు నిర్విఘ్నంగా కొనసాగింది. అనంతరం షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ శుక్రవారం రాత్రి 11:51 గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. రాకెట్‌ తన గమనం శాస్త్రవేత్తలు డిజైన్‌ చేసిన గమ్యాన్ని పూర్తిచేసుకొన్న అనంతరం ఎన్‌వీఎస్ -03 ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్య (జీటీవో)లో ప్రవేశపెట్టింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరిన వెంటనే మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.


అక్కడి నుంచి రాకెట్‌ గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ విజయవంతమైనట్టు ప్రకటించారు. సహచర శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకొని ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా నారాయణన్‌ మాట్లాడుతూ... ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహాన్ని అనుకున్నట్టుగానే నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామని తెలిపారు. ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారని.. ఇది సమష్టి విజయమని అన్నారు. ఈ విజయం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. కాగా, కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం స్థిరంగా ఉన్నట్లు బెంగుళూరులోని హసన్‌ మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌ గ్రౌండ్‌ స్టేషన్‌కు సిగ్నల్స్‌ అందాయి. ఎన్‌వీఎస్ -03 ఉపగ్రహ విజయంతో మరింత కచ్చితమైన నావిగేషన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - Oct 31 , 2026 | 02:36 AM