భారత్‌లో ‘పాక్’ దురంధర్‌లు!
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:09 AM
శత్రుదేశంలోకి అక్రమంగా చొరబడతాడు.. స్థానికంగా పరిచయం పెంచుకుంటాడు.. క్రిమినల్ ముఠాలు, రాజకీయ నాయకులకు దగ్గరవుతాడు..
జాతీయ రాజకీయ పార్టీల్లో చేరాలని తమ అనుచరులకు పాక్ ఐఎస్ఐ ఆదేశాలు
ఇటీవల పట్టుబడిన కొందరు ఉగ్రవాదుల అనుచరుల విచారణలో వెల్లడైందన్న అధికారులు
న్యూఢిల్లీ, మే 31: శత్రుదేశంలోకి అక్రమంగా చొరబడతాడు.. స్థానికంగా పరిచయం పెంచుకుంటాడు.. క్రిమినల్ ముఠాలు, రాజకీయ నాయకులకు దగ్గరవుతాడు.. రాజకీయ పార్టీల్లో తిరుగుతాడు.. అక్కడి నుంచి చేసే కుట్రలన్నీ తెలుసుకుని సమాచారమిస్తాడు.. క్రిమినల్స్‌ను చంపేస్తాడు.. ఇదంతా ఇటీవల సంచలనం సృష్టించిన దురంధర్ సిరీస్ సినిమాల్లోని కథ. ఇదే తరహాలో భారత్‌లో పాకిస్థానీ ‘దురంధర్’లను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర భద్రతా, నిఘా వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్‌లో వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ అనుచరులను భారత జాతీయ రాజకీయ పార్టీల్లో చేరాలని పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) ఆదేశించినట్టుగా గుర్తించామని వెల్లడించాయి. ఉగ్రవాదులతో సంబంధమున్న కొందరిని ఇటీవల శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేసి, విచారించిన సమయంలో వారు జాతీయ రాజకీయ పార్టీల్లో సభ్యులుగా ఉన్నట్టుగా తేలిందని పేర్కొన్నాయి. స్థానికంగా ఉన్న పాత ఉగ్రవాద సంస్థలను పునరుద్ధరించేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపాయి.
ఉగ్రవాదంపై లోతైన వ్యూహంతో..
ఉగ్రవాద సంస్థలుగానీ, నిఘా సంస్థలుగానీ తమకు కీలకమైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అనుచరులను (ఓవర్ గ్రౌండ్ వర్కర్స్)ను ఏర్పాటు చేసుకుంటాయి. వారు ఎవరికీ అనుమానం రాకుండా స్థానికుల్లో కలిసిపోతారు. వారు నేరుగా పనిచేయరు. ఉగ్రవాదులు, గూఢచారులకు అవసరమైన డబ్బు, ఆయుధాలు, బస, ఇతర సహాయం అందిస్తారు. పాక్ ఐఎస్ఐ జమ్మూకశ్మీర్‌లోని ఇలాంటి అనుచరులను జాతీయ రాజకీయ పార్టీల్లో చేరాల్సిందిగా ఆదేశించినట్టు తేలిందని భద్రతా సంస్థల అధికారులు తెలిపారు. తనిఖీల సమయంలో, మరేదైనా కీలక సమయంలో భద్రతా దళాలకు తాము జాతీయ పార్టీల సభ్యులమని చెప్పి తప్పించుకునే వ్యూహం ఇది అని పేర్కొన్నారు. మరోవైపు 1990వ దశకంలో చురుకుగా పనిచేసి, తర్వాత మరుగున పడిన స్థానిక ఉగ్రవాద సంస్థలను పునరుద్ధరించి.. వాటి పేరిట స్థానిక యువతను రెచ్చగొట్టి చేర్చుకునే ప్రయత్నాలను కూడా ఐఎస్ఐ మొదలుపెట్టిందని చెప్పారు. ఆ ఉగ్రవాద సంస్థల పేరిట దాడులు చేయడం ద్వారా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం భారత అంతర్గత, స్థానిక సమస్య అని చూపించే వ్యూహమని వివరించారు. ఇటీవలికాలంలో అల్ ఉమర్ ముజాహిదీన్, అల్ బద్ర్, తెహ్రీక్ ఉల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద సంస్థల పేర్లు మళ్లీ తెరపైకి రావడం అందులో భాగమేనని స్పష్టం చేశారు. మొత్తంగా భారత్‌లో ఉగ్రవాదం విషయంలో పాక్ ప్రత్యక్ష ప్రమేయాన్ని దాచడం, భద్రతా సంస్థల నిఘా నుంచి తప్పించుకోవడం లక్ష్యంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా గుర్తించామని వెల్లడించారు. ఈ పరిణామాలను కేంద్ర నిఘా సంస్థలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయని పేర్కొన్నారు.
సరిహద్దుల్లో పాక్ అక్రమ సిగ్నల్స్
జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాద గ్రూపులకు సాయపడేందుకు భారత సరిహద్దుల్లో లోపలి ప్రాంతాలకు కూడా సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందేలా పాకిస్థాన్ కుట్రలకు పాల్పడుతోందని అధికారులు తెలిపారు. ఇందుకోసం సరిహద్దుల వెంబడి భారీగా టెలికాం టవర్లు ఏర్పాటు చేసిందని.. వాటి నుంచి వచ్చే సంకేతాలు కథువా, రాజౌరి, పూంఛ్ వంటి సరిహద్దు జిల్లాలతోపాటు కరుడుగట్టిన ఉగ్రవాదులను ఉంచిన జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు ప్రాంతానికి కూడా చేరుతున్నట్టు గుర్తించామని వెల్లడించారు. పాకిస్థాన్ సిమ్‌కార్డులు, ఈ సిగ్నల్స్ ద్వారా పాక్‌లోని హ్యాండ్లర్లు భారత్‌లోని ఉగ్రవాదులు, అనుచరులకు మధ్య సందేశాల మార్పిడి జరుగుతోందని చెప్పారు. భారత నిఘాను తప్పించుకునేందుకు చైనా సాయంతో సీడీఎంఏ సాంకేతికతను, స్మార్ట్‌ఫోన్‌లను రేడియో సెట్లతో అనుసంధానించి వినియోగిస్తున్నారని తెలిపారు. కాగా, పాకిస్థాన్ ఐఎ్‌సఐ మద్దతుతో సామాజిక మాధ్యమాల ద్వారా భారత్‌లోని యువతను తప్పుదోవ పట్టిస్తున్న పాకిస్థాన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ షహజాద్ భట్టిపై భద్రతా సంస్థలు నిఘా పెట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి.