Maoist movement: ఉద్యమ ఉప్పెన నుంచి నెత్తుటి నిశ్శబ్దానికి!
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:59 AM
సుమారు 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టు పార్టీకి అంతిమ ఘడియలు సమీపించినట్టేనా? ఉద్యమంతో ఉప్పెనలా నింగికి ఎగిసిన మావోయిస్టు పార్టీ ఎన్‌కౌంటర్లు.....
అంతిమ ఘడియల్లో మావోయిస్టు పార్టీ?.. ఉధృతంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్
కేంద్రం పెట్టుకున్న గడువుకు ఇంకా మిగిలి ఉన్నది మరో 90రోజులే!
చర్ల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): సుమారు 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టు పార్టీకి అంతిమ ఘడియలు సమీపించినట్టేనా? ఉద్యమంతో ఉప్పెనలా నింగికి ఎగిసిన మావోయిస్టు పార్టీ ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో నెత్తుటి నిశ్శబ్ధానికి చేరినట్టేనా? దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యంలో ఇక ఉద్యమ నినాదాలు ఆగిపోయినట్టేనా?.. ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలన్నీ ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను అంతం చేయడం లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ దాదాపుగా చివరి దశకు చేరింది. మావోయిస్టు అగ్రనేతల్లో చాలా మంది మరణించడమో, లొంగిపోవడమో జరిగింది. దిగువస్థాయి కేడర్‌లోనూ లొంగుబాట్లు పెరిగాయి. ప్రస్తుతం పార్టీ చీఫ్ దేవ్‌జీతోపాటు గణపతి, మిషిర్ బెస్రా కేంద్ర కమిటీ సభ్యులుగా మావోయిస్టు పార్టీని నడిపిస్తున్నారు. వారికి తోడుగా తెలంగాణ కార్యదర్శి దామోదర్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు ఉన్నారు. ఈ ఐదుగురు లొంగిపోయినా, అరెస్టయినా, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినా మావోయిస్టు పార్టీ కథ ముగిసినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం ఆపరేషన్ కగార్ ముగింపునకు పెట్టుకున్న లక్ష్యం మరో 90 రోజులే ఉన్న నేపథ్యంలో గత రెండేళ్లలో జరిగిన పరిణామాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
దశాబ్దాల పట్టును దెబ్బతీసే ప్రణాళికతో..
దేశంలో సుమారు 16 రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు మావోయిస్టుల ప్రభావం కొనసాగింది. ముఖ్యంగా ఛత్తీ్‌సగఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు పట్టుకొనసాగించారు. అడవుల్లోకి వెళ్లాలంటే వణికి పోయే పరిస్థితి ఉండేది. మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కలిసి ఆపరేషన్ గ్రీన్‌హంట్, ఆపరేషన్ ప్రహార్ వంటివి చేపట్టినా పెద్దగా ప్రభావం కనిపించలేదు. 2021లో తెర్రం అడవుల్లో హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు చేసిన దాడిలో 21 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. మరొకరిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజలు, విలేకరుల సమక్షంలో విడిచిపెట్టారు. ఆ ఘటనతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సుమారు రెండేళ్లపాటు పక్కాగా ప్రణాళిక రూపొందించి ‘ఆపరేషన్ కగార్’ ప్రారంభించింది. బస్తర్ డివిజన్‌లోని 7 జిల్లాల్లో ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్లకు ఒక సీఆర్‌పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేశారు. అనధికారిక లెక్కల ప్రకారం 500కుపైగానే క్యాంపులు పెట్టి.. కమాండోలనూ మోహరించింది.
ఆ రెండు వంతెనలే కీలకం..
ఆపరేషన్ కగార్‌లో రెండు భారీ వంతెనల నిర్మాణం కీలకంగా నిలిచింది. నేషనల్ పార్కులో కట్టిన వంతెన ఒకటి, పామేడు అడవుల్లో చింతవాగుపై వంతెన రెండోది. వీటి ద్వారా భద్రతా బలగాల రాకపోకలు, క్యాంపుల ఏర్పాటు సులువు అయ్యాయి. మరోవైపు బస్తర్‌లోని ఏడు జిల్లాల్లో మావోయిస్టుల నుంచి ఆదివాసీలను దూరం చేసేందుకు అభివృద్ధి మంత్రాన్ని జపించింది. రోడ్లు, విద్య, వైద్యం, రేషన్, మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెల్లగా గ్రామాల వారికి దగ్గరై.. మావోయిస్టులతో సంబంధాలున్న వారిని, ఇన్ఫార్మర్లను గుర్తించి అరెస్టు చేసింది. విస్తృతంగా కూంబింగ్‌లు చేపడుతూ మావోయిస్టులను వెంటాడింది.
ముఖ్య నాయకత్వమంతా అంతం!
ఆపరేషన్ కగార్, ఇతర కారణాలతో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం చాలా వరకు తుడిచిపెట్టుకుపోయింది. పార్టీ జనరల్ సెక్రెటరీ బసవరాజు, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల రవి, భాస్కర్, ప్రయాంగ్, కట్టా రామచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణరెడ్డి, హిడ్మా, ఉయికా గణేశ్ మృతిచెందారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు సుధాకర్, జగదీశ్, రేణుక, మధు, భాస్కర్‌రావు, రణధీర్, నిర్మల, రూపేశ్, జోగన్న, దస్రు కూడా మరణించారు.
మిగిలిన అగ్రనేతలు వీరే..
మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పుడు 41 మంది కేంద్ర కమిటీ సభ్యులున్నారు. ఆపరేషన్ కగార్‌లో 11 మంది మృతి చెందారు. మరికొందరు లొంగిపోయారు. ప్రస్తుతం ముగ్గురే మిగిలారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇద్దరూ తెలంగాణ వారే. మరొకరు జార్ఖండ్‌కు చెందిన మిషిర్ బెస్రా అలియాస్ భాస్కర్. ఇక మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు.
మావోయిస్టులకు చివరి ఊపిరి: బస్తర్ ఐజీ
మార్చి 31నాటికి బస్తర్ అడవులు మావోయిస్టు రహితంగా మారుతాయని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ పేర్కొన్నారు. అడవుల్లో 2025లో 52కు పైగా క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు. మావోయిస్టు పార్టీ చివరి ఊపిరి తీసుకుంటోందన్నారు. లొంగిపోయినవారికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు.