భారత్‌కు రావాల్సిన ఇరాన్ చమురు నౌక చైనాకు!
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:26 AM
ఇరాన్ చమురుతో భారత్‌కు బయలుదేరిన నౌక మార్గ మధ్యంలో దారి మార్చుకుంది. అది చైనా వైపు వెళుతున్నట్లు నౌకలను ట్రాక్ చేసే కెప్లెర్ సంస్థ వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఇరాన్ చమురుతో భారత్‌కు బయలుదేరిన నౌక మార్గ మధ్యంలో దారి మార్చుకుంది. అది చైనా వైపు వెళుతున్నట్లు నౌకలను ట్రాక్ చేసే కెప్లెర్ సంస్థ వెల్లడించింది. శనివారం ఆ నౌక గుజరాత్‌లోని వాదినార్ పోర్టుకు వస్తుందని మొదట సమాచారం వచ్చింది. అయితే అది ప్రస్తుతం చైనాలోని డాంగ్‌యింగ్ పోర్టు వైపునకు వెళుతోంది. షిప్‌లోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం(ఏఐఎస్) చూపుతున్నదే తుది గమ్యమని నిర్ధారణ లేకపోయినప్పటికీ మూడు రోజులుగా భారత్‌వైపు ప్రయాణించిన పింగ్ షన్ నౌక ప్రస్తుతం చైనా వైపు మళ్లిందని కెప్లెర్ రీసెర్చ్ ఎనలిస్ట్ సుమత్ రితోలియా చెప్పారు. చెల్లింపులకు సంబంధించిన సమస్యల వల్లే అది గమ్యం మారినట్లు తెలిపారు. గతంలో ఉన్న 30-60 రోజుల క్రెడిట్ కాలపరిమితికి బదులు, అమ్మకందారులు ఇప్పుడు ముందస్తు, తక్షణ చెల్లింపులను కోరుతున్నారు. అయితే అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ స్విఫ్ట్‌తో ఇరాన్‌కు సంబంధాలు లేకపోవడంతో చెల్లింపులు కష్టతరంగా మారాయి. మార్చి మొదటి వారంలో పింగ్ షన్ నౌకలో ఖార్గ్ ద్వీపం వద్ద 6 లక్షల బ్యారెళ్ల చమురును నింపారు. ఇది ఏప్రిల్ 4న గుజరాత్‌లోని వాదినార్ పోర్టుకు చేరుకుంటుందని ఇటీవల కెప్లెర్ తెలిపింది.