హోర్ముజ్‌లో సర్వీసు ఫీజు!
ABN , Publish Date - Jul 06 , 2026 | 03:00 AM
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు కొత్తగా సర్వీసు ఫీజు విధించనున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే, కష్టకాలంలో ...
దాన్ని టోల్ ఫీజుగా భావించొద్దు: ఇరాన్
బీజింగ్/న్యూఢిల్లీ, జూలై 5: హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు కొత్తగా సర్వీసు ఫీజు విధించనున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే, కష్టకాలంలో తమకు మద్దతుగా నిలిచిన మిత్రదేశాలకు ప్రత్యేక వెసులుబాటు ఉంటుందని తెలిపింది. చైనా రాజధాని బీజింగ్‌లోని వరల్డ్ పీస్ ఫోరం కార్యాలయం వద్ద ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా శనివారం ఈ విషయాలను వెల్లడించారు. హోర్ముజ్ గుండా ట్రాఫిక్ నిర్వహణకు నూతన ఏర్పాట్లపై ఒమన్‌తో కలిసి ఇరాన్ పనిచేస్తోందని ఆయన చెప్పారు. హోర్ముజ్ గుండా నౌకలు సురక్షితంగా వెళ్లేందుకు, వాటి రాకపోకలను పర్యవేక్షించేందుకు, నౌకల భారీ ట్రాఫిక్ వల్ల ఏర్పడే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం తదితర సేవలకుగానే ఈ సర్వీసు ఫీజు వసూలు చేయనున్నామని, దాన్ని టోల్ ఫీజుగా భావించవద్దని అన్నారు. మిత్రదేశాలకు వెసులుబాటు ఉంటుందన్న నేపథ్యంలో భారతదేశం నుంచి ఈ ఫీజు వసూలు చేయడంపై అస్పష్టత నెలకొంది. ఇదిలా ఉండగా, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారతదేశంలో ఎరువుల సరఫరాపై పెద్దగా లేదని, ఎరువులను తీసుకొస్తున్న 15 నుంచి 20 నౌకలు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటాయని కేంద్రప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో ఎనిమిది నౌకలు 3.32 లక్షల టన్నుల యూరియా, నాలుగు నౌకలు 2.57 లక్షల టన్నుల డీఏపీ, మూడు నౌకలు 1.11 లక్షల టన్నుల సల్ఫర్‌తో సకాలంలో భారత పోర్టులను చేరుకోనున్నట్టు పేర్కొంది. మరో ఐదు నౌకలు ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లో ఉన్నాయని, ఒక్కోటి 0.25 లక్షల టన్నుల అమ్మోనియా, 0.45 లక్షల టన్నుల యూరియా తీసుకొస్తున్నాయని వివరించింది. మరో రెండు నౌకల్లో యూరియా, ఇంకో నౌకలో సల్ఫర్ లోడింగ్ జరుగుతోందని తెలిపింది. కాగా, హోర్ముజ్ గుండా ఎల్‌ఎన్‌జీ సరఫరా సాధారణ స్థాయికి చేరడంతో భారత ప్రభుత్వం దేశీయంగా గ్యాస్ సరఫరా పైన ఆంక్షలను ఎత్తివేసింది.