Share News

ఖొమేనీ ప్రభావంతో విప్లవ బాట!

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:17 AM

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతితో ఒక శకం ముగిసినట్లయింది. 1989లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఖమేనీ మతపరంగా అత్యంత కఠినమైన నియంత్రణ విధానాలనే అనుసరించారు.

ఖొమేనీ ప్రభావంతో విప్లవ బాట!

  • ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ఎదిగిన ఖమేనీ

న్యూఢిల్లీ, మార్చి 1: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతితో ఒక శకం ముగిసినట్లయింది. 1989లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఖమేనీ మతపరంగా అత్యంత కఠినమైన నియంత్రణ విధానాలనే అనుసరించారు. దేశంలో చెలరేగిన పలు ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేశారు. ఇరాన్‌ను పశ్చిమాసియాలో అధికార కేంద్రంగా మార్చాలని ఆకాంక్షించేవారు. అణుపరీక్షల విషయంలో అమెరికా, ఇజ్రాయెల్‌తో ఘర్షణకు దిగారు. ఖమేనీ అమెరికాను తీవ్రంగా వ్యతిరేకించారు. ఖమేనీ 1939 ఏప్రిల్‌ 19న జన్మించారు. చిన్ననాటి నుంచే ఇస్లామిక్‌ థియాలజీ (దార్శనిక శాస్త్రం)లో విద్యాభ్యాసం చేశారు. ఆయన ప్రముఖ షియా పండితుడు రుహొల్లా ఖొమేనీ ప్రభావంతో విప్లవ భావజాలాన్ని స్వీకరించారు. 1979 ఇరాన్‌ విప్లవ సమయంలో షా మహమ్మద్‌ రెజా పహ్లవీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. విప్లవం తర్వాత కొత్త ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1981లో ఇరాన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధ సమయంలో దేశాన్ని సమర్థంగా నడిపించారు. 1989లో ఖొమేనీ మరణించిన తర్వాత మితవాద మతగురువులు ఖమేనీని ఇరాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌కు సుప్రీం లీడర్‌గా నియమించాలని పట్టుపట్టారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఖమేనీ ప్రకటించినా.. వారు మాత్రం ఆయనకే మద్దతు పలికారు. దీంతో 1989 నుంచి ఇప్పటి వరకు ఆయనే సుప్రీం లీడర్‌గా ఉన్నారు. 1999లో విద్యార్థుల ఆందోళనలు, 2009లో వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలకు వ్యతిరేకంగా నిరసనలు, 2019లో ఆందోళనలు జరగ్గా.. ఖమేనీ వాటన్నింటినీ తనదైన శైలిలో అణచివేశారు. కాగా, అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోయాయి. తాజాగా దుస్తుల నిబంధనను ఉల్లంఘించారంటూ కుర్దిష్‌ మహిళ మాసా అమినీని అరెస్టు చేయగా.. ఆమె పోలీసుల కస్టడీలో మృతి చెందారు. దీనిపై ఇరాన్‌వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. అలాగే హిజాబ్‌పైనా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి.

Updated Date - Mar 02 , 2026 | 02:18 AM