Share News

భారత్‌ ట్యాంకర్లకు ఇరాన్‌ పచ్చజెండా!

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:17 AM

హోర్ముజ్‌ జలసంధి ద్వారా సురక్షితంగా వెళ్లడానికి భారత నౌకలకు త్వరలోనే వీలు కల్పిస్తామని భారత్‌లో ఇరాన్‌ రాయబారి మొహహ్మద్‌ ఫతాలీ శుక్రవారం నాడు సూచనప్రాయంగా వెల్లడించారు.

భారత్‌ ట్యాంకర్లకు ఇరాన్‌ పచ్చజెండా!

న్యూఢిల్లీ, మార్చి 13 : హోర్ముజ్‌ జలసంధి ద్వారా సురక్షితంగా వెళ్లడానికి భారత నౌకలకు త్వరలోనే వీలు కల్పిస్తామని భారత్‌లో ఇరాన్‌ రాయబారి మొహహ్మద్‌ ఫతాలీ శుక్రవారం నాడు సూచనప్రాయంగా వెల్లడించారు. భారత్‌ తమ మిత్ర దేశమని, ఈ ప్రాంతంలో రెండు దేశాలు ఉమ్మడి ప్రయోజనాసక్తి కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్‌ జలసంధి మూసివేత దరిమిలా భారత్‌ సహా అనేక దేశాల చమురు ట్యాంకర్లు ఎక్కడికక్కడ చిక్కుబడిపోయాయి. ఫలితంగా భారత్‌లో చమురు, గ్యాస్‌ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫతాలీ చేసిన వ్యాఖ్యలు ఎంతోకొంత ఉపశమనం కలిగించేవే. హోర్ముజ్‌ జలసంధి మీదుగా ఇప్పటికే ఒక చమురు నౌక భారత్‌కు చేరుకుంది. మరో ముడిచమురు ట్యాంకర్‌ శనివారం నాటికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో భారత్‌లో పెట్రోలు, వంట గ్యాస్‌ సరఫరా పరిస్థితి కొంతవరకు మెరుగుపడవచ్చు. ఇరాన్‌పై అన్యాయంగా జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాల్పిందిగా ప్రపంచ దేశాల నాయకులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురాగలిగితే పరిస్థితి పూర్తిగా కుదుటపడి భారత్‌కు మరింత ప్రయోజనం కలుగుతుందని భారత్‌లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అధికార ప్రతినిధి డాక్టర్‌ అబ్దుల్‌ మాజిద్‌ హకీమ్‌ ఇలాహీ వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్చి శుక్రవారం నాడు వరుసగా నాలుగోసారి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడడం మరో కీలక పరిణామం. యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో తలెత్తిన పరిస్థితులు, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఆయన చర్చించారు. ప్రపంచంలో శాంతి, సుస్థిరతల సాధనకు బ్రిక్స్‌ దేశాలు సహకరించాలని, బ్రిక్స్‌లో కీలక భాగస్వామి అయిన భారత్‌ ఈ విషయంలో ప్రముఖ పాత్ర పోషించాలని ఆయన జైశంకర్‌ను కోరారు. చమురు సరఫరాలో స్థిరత్వాన్ని తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భారత్‌ కీలక భాగస్వామిగా ఉందంటూ మరోవైపు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గొర్‌ ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత్‌తో కీలక ఖనిజాలకు సంబంధించిన ఒప్పందం ఖరారు దశలో ఉందని ఆయన వెల్లడించారు. భారత్‌ తరహాలోనే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలకు కూడా అమెరికా అనుమతి ఇవ్వడం ఈ సందర్భంగా మరో ముఖ్య పరిణామం. ఇరాన్‌ యుద్ధం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. హోర్ముజ్‌ జలసంధి ప్రాంతంలో ఇప్పటికే 16కు పైగా చమురు ట్యాంకర్లు, కార్గో, వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యా్‌సలకు ఇప్పటికే కటకట ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ నుంచి సానుకూల సంకేతాలు రావడం పరిస్థితిని కుదటపరిచేదే..!!

Updated Date - Mar 14 , 2026 | 04:17 AM